వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఆదేశాల మేరకే పట్టాభి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని అయన అనుమానం వ్యక్తం చేశారు. లేకపోతే ఈ వ్యాఖ్యలు అయన దృష్టికి రాగానే వెంటనే క్షమాపణ చెప్పించి ఉండేవారని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రజాభిమానంతో పెద్ద మెజార్టీతో గెలిచిన సిఎం జగన్ పై ఇలాంటి వ్యాఖ్యలను సభ్యసమాజం ఎప్పటికీ హర్షించబోదని అయన స్పష్టం చేశారు. ప్రజల్లో మనుగడ కోల్పోతున్నామనే దుగ్ధతో, భవిష్యత్తు అంధకారమయంగా కనబడుతూ, నిర్లిప్తత ఆవరించి ఇలాంటి వ్యాఖ్యలకు దిగుతున్నారని ఆరోపించారు. ఏ రాజకీయ పార్టీకి అంత ఫ్రస్ట్రేషన్ అవసరం లేదని, రాజ్యాంగం ప్రసాదించిన ఎన్నికల ప్రక్రియ ద్వారా, ప్రజాస్వామ్యంబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వం ఐదేళ్లపాటు అధికారంలో ఉంటుందని, ఈ విషయం తెలిసి కూడా కేవలం తన ఉనికి కాపాడుకోవడం కోసమే, తన నైరాశ్యాన్ని బైటపెట్టుకోవడానికి, పార్టీ కేడర్ తనను వదిలి వెళ్లిపోతారనే భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని, కానీ వీటితో సాధించేదేమీ ఉండబోదని అయన స్పష్టం చేశారు.
నెల్లూరు జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ చక్రధర్ బాబును పార్టీ నేతలతో ఆనం రామనారాయణ రెడ్డి కలిశారు. టీడీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్ ను కోరారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. చంద్రబాబు ఎందుకు దీక్ష చేశారో ఆయనకే తెలియదని, అయన దిగజారుడు తనాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించారని ఆనం చెప్పారు. వైఎస్సార్సీపీ చేపట్టిన ప్రజాగ్రహదీక్షలో టిడిపి నేతలు చేసిన అసభ్య పదజాలాన్ని నిరసిస్తూ సంతకాల సేకరణ చేశామని, వాటిని జిల్లా కలెక్టర్ ద్వారా గవర్నర్ కు మహాజరు సమర్పించామని ఆనం వివరించారు.