Friday, September 20, 2024
HomeTrending Newsషియా – సున్నీల ఘర్షణల్లో 12 మంది మృతి

షియా – సున్నీల ఘర్షణల్లో 12 మంది మృతి

పాకిస్తాన్ లో షియా – సున్నీ ల మధ్య ఘర్షణల్లో 12 మంది చనిపోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్రంలోని కుర్రం జిల్లా కోహత్ డివిజన్ లో గత కొద్ది రోజులుగా రెండు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. వంట చెరుకు కోసం అడవుల్లో జరిగిన గొడవలు కాల్పుల వరకు దారితీశాయి. అల్లర్లను అదుపు చేసేందుకు భారీ సంఖ్యలో పోలీసు, మిలిటరీ బలగాలను జిల్లాలో మొహరించారు. శాంతి స్థాపన కోసం గిరిజనుల పంచాయతి ( జిర్గా) ప్రయత్నాలు చేస్తోంది.

ఖైభర్ పఖ్తుంక్వరాజధాని పెషావర్ కు 250 కిలోమీటర్ల దూరంలోని కోహత్ డివిజన్ లోని కొండలు, అటవీ ప్రాంతాల మీద ఆధిపత్యం, హక్కుల కోసం షియా – సున్నీ వర్గాల మధ్య దశాబ్దాలుగా వైరం ఉంది. సున్నీ వర్గానికి చెందిన గైడు తెగకు చెందిన కొందరు షియాలోని పెవార్ తెగకు చెందిన వారిపై కాల్పులకు తెగపడ్డారు. శనివారం జరిగిన రెండు గిరిజన తెగల వైరం కాస్తా షియా సున్నీ గొడవలకు దారితీసింది. నిన్న రాత్రి వందలమంది తుపాకులతో స్వైర విహారం చేస్తూ పరస్పరం కాల్పులకు దిగారు. దీంతో కుర్రం డివిజన్ లోని అనేక గ్రామాలు అగ్నికి ఆహుతయ్యాయి.

ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్రంలో ఆయుధ పరిశ్రమ నిరాటంకంగా సాగుతోంది. చట్టవిరుద్దంగా జరుగుతున్న ఈ వ్యాపారాన్ని కట్టడి చేయటం పాక్ ప్రభుత్వంతో కూడా కావటం లేదు. ఆఫ్ఘనిస్తాన్ కు సరిహద్దు రాష్ట్రం కావటంతో అక్రమంగా ఆయుధ రవాణ, డ్రగ్స్ స్మగ్లింగ్ ఇక్కడ సాధారణం. మొదటి నుంచి తాలిబాన్ అనుకూల వర్గాలు ఇక్కడ ఆధిపత్యం కలిగి ఉన్నాయి. ఆఫ్ఘన్ లో షియా మీద దాడుల ప్రభావంతో ఇక్కడ మొదలయ్యాయి. సున్నీ వర్గం వారికి అల్ ఖైదా, తెహ్రీక్ ఎ తాలిబాన్ ల మద్దతు ఉండటంతో కొద్ది రోజులుగా హింసాత్మక ఘటనలు ఎక్కువయ్యాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్