Friday, November 22, 2024
Homeతెలంగాణప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఆక్సిజన్ ప్లాంట్లు : కెసియార్

ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఆక్సిజన్ ప్లాంట్లు : కెసియార్

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ రోగులకు అవసరమైన 324 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను 48 ప్రభుత్వ ఆస్పత్రులలో ఏర్పాటు చేసి భవిష్యత్ లో కూడా ఎలాంటి ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.
అదనంగా ఇంకా 100 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంటును కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
16 మెట్రిక్ టన్నుల ప్లాంట్లు 6 యూనిట్లు, 8 మెట్రిక్ టన్నుల ప్లాంట్లు 15 యూనిట్లు, 4 మెట్రిక్ టన్నుల ప్లాంట్లు 27 యూనిట్లు హైదరాబాద్ లో, జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఒక్కొక్కటి 20 టన్నుల కెపాసిటీ గల 11 ఆక్సిజన్ ట్యాంకర్లను 10 రోజుల్లోగా అందించాలని ఉత్పత్తిదారులను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఆక్సిజన్ సరఫరా విషయంలో రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల మీద ఆధారపడే పరిస్థితి ఉండొద్దని సీఎం అన్నారు.
సోమవారం ప్రగతి భవన్ లో కోవిడ్ పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిపారు.
కరోనా వైద్యం విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వరంగంలో పూర్తిగా ఉచిత వైద్యం, భోజన వసతి, మందులు తదితర సకల సౌకర్యాలు కల్పిస్తున్నందున పేద ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేరాలని సీఎం కోరారు.
సోమవారం నాటికి ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 6,926 బెడ్లు ఖాళీగా ఉన్నాయని, అందులో ఆక్సిజన్ బెడ్స్ 2,253, ఐసీయూ 533, జనరల్ బెడ్స్ 4,140 ఖాళీ ఉన్నాయని సీఎం వివరించారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్, రెమిడెసివిర్ మందులు సహా అన్నీ అందుబాటులోనే ఉన్నందున ప్రైవేటు హాస్పిటల్స్ ను ఆశ్రయించి, డబ్బులు పోగొట్టుకోవద్దని ముఖ్యమంత్రి ప్రజలకు సూచించారు. వైద్యం ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఎక్కడైనా ఒక్కటే అయినందున కోవిడ్ చికిత్సకు ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేరాలని సీఎం ప్రజలను కోరారు.
కరోనా రోగులకు తర్వాతి దశలో బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి సోకుతున్నదని, దానికి సంబంధించి చికిత్స అందించడం కోసం కోఠిలోని ఈ.ఎన్.టి, సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రుల్లో, జిల్లాలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రుల్లో ఎక్విప్ మెంట్, అవసరమైన మందులు సమకూర్చాలని సీఎం కేసీఆర్ అధికారులను కోరారు. ఇందుకు అవసరమైన 25 మైక్రో డీబ్రైడర్ మిషన్లు, హెచ్.డి. ఎండోస్కోపిక్ కెమెరాలను తక్షణమే తెప్పించాలని సీఎం ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్