కరోనా నియంత్రణ కోసం తమిళనాడు తరహాలోనే మన రాష్ట్రంలో కూడా అఖిల పక్ష కమిటీ వేయాలని సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని అయన డిమాండ్ చేశారు. నాలుగు రోజులనుంచి రాష్ట్రంలో వాక్సినేషన్ నిలిచిపోయిందని, గందరగోళ పరిస్థితి నెలకొని వుందని, ప్రభుత్వం ప్రణాళికతో వ్యవహరించడం లేదని విమర్శించారు. టెస్టులు కూడా సక్రమంగా జరగడంలేదన్నారు.
ప్రైవేటు ఆస్పత్రులు అధిక ఫీజులు వస్తూలు చేస్తున్నాయని, ఈ విషయమై సిఎం కేసిఆర్ కు ఎన్నిసార్లు విన్నవించినా కనీస స్పందన లేదని భట్టి మండిపడ్డారు. అధిక ఫీజులపై టాస్క్ ఫోర్స్ వేస్తూ జిఓ అయితే ఇచ్చారు కాని అది ఏమి చేస్తుందో ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫోన్ చేసి చెప్పినా కనీస స్పందన కరువైదని, సిఎస్ కూడా పరిస్థితిని సీరియస్ గా తీసుకోవడం లేదని అన్నారు. లాక్ డౌన్ అవసరం లేదని సిఎస్ చెప్పిన రెండు రోజులకే సిఎం లాక్ డౌన్ పెట్టారని గుర్తు చేశారు. త్వరలోనే గవర్నర్ ను కలిసి అన్ని విషయాలు వివరిస్తామని మల్లు వెల్లడించారు.