Telugu Cine Music Lovers Feels Tenacity By Listening Jikki Sweet Voice forever :
Jikki’s songs takes us to a pleasent atmosphere… తెలుగు పాటకు అమృతం అద్దిన స్వరం పేరు జిక్కీ .. తెలుగు పాటపై తేనె వానలు కురిపించిన వరం పేరు జిక్కీ. ఆమె స్వరమాధుర్యానికి సుమాలు వికసిస్తాయి .. పరిమళాలను హత్తుకున్న నక్షత్రాలై ప్రకాశిస్తాయి. ఆమె ఆలాపన భావాల ధారలను కురిపిస్తుంది .. అనుభూతుల దారిలో నడిపిస్తుంది. వెన్నలోని కమ్మదనం .. వెన్నెల్లోని చల్లదనం జిక్కీ సొంతం. హుషారుగా సాగే జానపదమైనా .. జలతారు నుంచి జాలువారుతున్నట్టుగా అనిపించే మెలోడీ గీతమైనా ఆమె స్వరాన్ని స్పర్శించి తరించిపోవలసిందే. ప్రతి మనసు మధురమైన ఆమె పాటల మాలికను ధరించి పులకించిపోవలసిందే.
జిక్కీ అనే పేరు వినగానే .. తెలుగు అమ్మాయి కాదేమోనని అప్పట్లో చాలామంది అనుకున్నారు. ‘తెలుగు అమ్మాయి కాకపోయినప్పటికీ ఎంత చక్కగా పాడుతుందో’ అని పొంగిపోయినవాళ్లూ ఉన్నారు. ఆమె అచ్చమైన .. స్వచ్ఛమైన తెలుగు అమ్మాయి .. అసలు పేరు పి.జి.కృష్ణవేణి. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఆమె నవంబర్ 3వ తేదీన జన్మించారు. దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన జిక్కీకి , ఊహతెలిసేసరికి తాము ఆర్థికపరమైన ఇబ్బందులను పడుతున్నామనే విషయం అర్థమైంది. ఆ కారణంగానే తన చదువు స్కూల్ స్థాయిలోనే ఆగిపోయిందనే విషయం నెమ్మదిగా ఆమెకి బోధపడింది.
మొదటి నుంచి జిక్కీకి పాటలంటే చాలా ఆసక్తి. పాటలు వినడమన్నా .. పాడటమన్నా ఇష్టం. అందువలన అది ఒక సాధన అని తెలియకుండానే ఆమె ఆ పనిని చేస్తూ వచ్చారు. బాల్యంలో జిక్కీ ముద్దుగా .. బొద్దుగా చూడముచ్చటగా ఉండేవారు. అందువలన కొన్ని సినిమాల్లో ఆమె బాలనటిగా నటించారు. టీనేజ్ లోకి అడుగుపెట్టే సమయానికి, తండ్రి బాధ్యతా రాహిత్యం కారణంగా కుటుంబ పోషణభారం ఆమెపై పడింది. అలాంటి సమయంలోనే ఆమెకి గాయనిగా అవకాశాలు రావడం .. తెలుగుతో పాటు తమిళ .. కన్నడ .. మలయాళ భాషల్లో అవకాశాలు అందుకుంటూ వెళ్లడం చేశారు.
జిక్కీ స్వరంలోని ప్రత్యేకతను ముందుగా గుర్తించినది గూడవల్లి రామబ్రహ్మాం. ఆయన దర్శకత్వంలో 1943లో ‘పంతులమ్మ’ సినిమా వచ్చింది. సారథీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఆ సినిమా ద్వారా గాయనిగా జిక్కీ పరిచయమయ్యారు. అప్పటి నుంచి పాటల పడవలో ఆమె ప్రయాణం మొదలైంది. ఒక వైపున సుశీల .. మరో వైపున జానకి తిరుగులేని గాయనీమణులుగా దూసుకుపోతున్నప్పటికీ, తన గాత్రంలోని ప్రత్యేకత కారణంగా జిక్కీ తట్టుకుని నిలబడగలిగారు. ఘంటసాల మాస్టారుతో కలిసి ఆమె అనేక పాటలను ఆలపించారు.
‘చెట్టు లెక్కగలవా ఓ నరహరి’(చెంచులక్ష్మి) ‘ఏరువాకసాగారో (రోజులు మారాయి) ‘టౌను పక్కకెళ్లోద్దురో (తోడికోడళ్లు) ‘చిట్టిపొట్టి బొమ్మలు’ (శ్రీమంతుడు) హాయిహాయిగా ఆమని సాగే (సువర్ణ సుందరి) ‘జీవితమే సఫలము’ (అనార్కలి) ‘పందిట్లో పెళ్లవుతున్నదీ (ప్రేమలేఖలు) వంటి పాటలు జిక్కీ స్వర సంద్రంలో నుంచి ఏరుకొచ్చిన కొన్ని ఆణిముత్యాలు. ఏదో తెలియని తీయదనం .. మరేదో తెలియని కమ్మదనాన్ని గుమ్మరించే స్వరం జిక్కీకి లభించిన వరం. ఆ ప్రత్యేకత కారణంగానే ఆమెను అటు ప్రేక్షకులు గానీ .. ఇటు ఇండస్ట్రీ గాని మరిచిపోలేదు.
అందువల్లనే ‘సంపూర్ణరామాయణం’ సినిమాకి పాడిన రెండు దశాబ్దాలకి జిక్కీని గుర్తుపెట్టుకుని మరీ పిలిపించారు. ఆ పాట ఆమె పాడితేనే న్యాయం జరుగుతుందని భావించి పట్టుబట్టి ఇళయరాజా ఆమెతో ఒక పాటపాడించారు. ఆ పాటనే ‘జాణవులే నెరజాణవులే’ (ఆదిత్య 369). కథాకథనాల సంగతి అటుంచితే, జిక్కీ గానం ప్రేక్షకులను కృష్ణదేవరాయలవారి కాలానికి తీసుకుని వెళ్లిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ పాట అంతగా మంత్రముగ్ధులను చేస్తుంది. అంత గొప్ప గాయనిని వదిలిపెట్టి ఆ కాలం నుంచి రావాలని అనిపించదు.
ఆ తరువాత నిన్నే పెళ్లాడేస్తానంటే (నిన్నే పెళ్లాడతా) .. ‘ అలనాటి రామచంద్రుడు’ (మురారి) సినిమాల్లోని పాటలతోను ఆమె ప్రేక్షకులను పరవశింపజేశారు. బాల్యంలో తండ్రి ప్రేమకు పెద్దగా నోచుకోని జిక్కీ, ఆరుగురు సంతానం కలిగిన తరువాత భర్తను కోల్పోయారు. ఆమె భర్త ప్రముఖ గాయకుడు .. సంగీత దర్శకుడు ఎ.ఎమ్. రాజా. అప్పట్లో ఇద్దరూ కలిసి వరుస సినిమాలకి పాడుతూ ఉండటం వలన పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడానికి .. పెళ్లివరకూ వెళ్లడానికి ఎక్కువకాలం పట్టలేదు.
అయితే ఇద్దరూ కూడా ఒక వైపున సినిమా పాటలతో .. మరో వైపున కచేరీలతో బిజీగా ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లోనే ప్రమాదవశాత్తు రాజా రైలు క్రిందపడి మరణించాడు. అప్పటికి పిల్లలంతా చిన్నవారే. అయినా ధైర్యం కూడగట్టుకుని ఆమె స్వరయాత్రను కొనసాగించారు. గుండె నిండుగా తీరని దుఃఖం ఉన్నప్పటికీ .. తన స్వరంతో మకరందంలో తీపి కలుపుతున్నట్టుగా అనిపించే మాధుర్యమైన పాటలను ఆలపించారు. జీవితంలో కష్టాలు .. కన్నీళ్లు .. చివరిదశలో అనారోగ్యం ఆమెను సతమతం చేస్తున్నప్పటికీ, వాటి నుంచి ఊరట పొందడానికే కదా భగవంతుడు తనకి అంతటి అద్భుతమైన స్వరాన్ని ఇచ్చినది అనుకున్నారు. తన పాటలను తానే పాడుకుంటూ సేదదీరారు. అలాంటి జిక్కీ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా మనసారా ఓ సారి ఆమెను స్మరించుకుందాం.
(జిక్కీ జయంతి ప్రత్యేకం)
— పెద్దింటి గోపీకృష్ణ