బాంబు దాడుల్లో క్షతగాత్రులైన చిన్నారులకు సేవలందించేందుకు గాజా పట్టణంలోకి తమను అనుమతించాలని యునిసెఫ్ విజ్ఞప్తి చేసింది. వారికి కావాల్సిన నిత్యావసరాలు, మందులు, మెడికల్ కిట్లు, కోవిడ్ వాక్సిన్ అందించేందుకు మానవతా దృక్పధంతో తమను వెళ్ళనివ్వాలని యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రిఎట్టా ఫోర్ కోరారు.
ఇజ్రాయెల్ బలగాలు గత వారం రోజులుగా గాజాలోని హమాస్ తీవ్రవాద శిబిరాలపై, భవంతులపై రాకెట్ దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల్లో ఉగ్రవాదులతో పాటు 60 మంది చిన్నారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో 440 మంది వరకూ గాయపడ్డారు. గాజాలో మొత్తం 30 వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 3 లక్షల మంది ప్రజలు మంచినీరు, పారిశుధ్య సేవల కోసం అల్లాడుతున్నారు. విద్యుత్ కోత వల్ల 60 శాతం ఆస్పత్రులు జనరేటర్ సౌకర్యంతోనే నడుస్తున్నాయి.
గాజా ఆస్పత్రులకు వెంటనే ఇంధనం సరఫరా చేయాల్సి ఉందని, లేకపోతె వైద్య సేవల్లో అంతరాయం ఏర్పడి మరికొంత మంది ప్రాణాలు కోల్పోతారని యునిసెఫ్ ప్రతినిధి ఆందోళన వ్యక్తం చేశారు.