ICC T20 Wc Sri Lanka Beat West Indies By 20 Runs :
డిపెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ ఈ సిరీస్ లో మరోసారి పేలవమైన ఆటతీరు ప్రదర్శించింది. టి-20 వరల్డ్ కప్ లో నేడు జరిగిన మరో మ్యాచ్ లో వెస్టిండీస్ ను శ్రీలంక20 పరుగుల తేడాతో ఓడించింది. వెస్టిండీస్ లో నికోలస్ పూరన్, హెట్ మెయిర్ ఇద్దరే రాణించారు. మరోసారి టాపార్డర్ ఘోరంగా విఫలం కావడంతో ఓటమి మూటగట్టుకుంది.
అబుదాబీలోని షేక్ జయేద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే సెమీస్ నుంచి నిష్క్రమించిన లంక దూకుడుగా ఇన్నింగ్స్ మొదలు పెట్టింది, తొలి వికెట్ కు ఓపెనర్లు 42 పరుగులు జోడించారు. కుశాల్ పెరీరా 29 పరుగులు చేసి అండీ రస్సెల్ బౌలింగ్ లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రెండో వికెట్ కు నిశాంక, చరిత్ అసలంక 91 పరుగులు జోడించారు. నిశాంక 41 బంతుల్లో 5 ఫోర్లతో 51 పరుగులు చేసి బ్రావో బౌలింగ్ లో హెట్ మెయిర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మరో ఆటగాడు అసలంక 41 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్ తో 68 పరుగులు చేసి ఔటయ్యాడు. చివర్లో కెప్టెన్ షనుక కేవలం 14 బంతుల్లో 25 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో లంక నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 189 పరుగులు చేసింది.
భారీ లక్ష్యంతో బ్యాటింగ్ మొదలు పెట్టిన వెస్టిండీస్ రెండో ఓవర్లోనే ఓపెనర్లు ఇద్దరి వికెట్లు (గేల్-1; లూయీస్-8) కోల్పోయింది. జట్టులో కేవలం ఇద్దరు ఆటగాళ్లే రెండంకెల స్కోరు చేయగలిగారు. హెట్మెయిర్ 54 బంతుల్లో 8 ఫోర్లు 4 సిక్సర్లతో 81 పరుగులతో అజేయంగా నిలిచి మరోసారి తన బ్యాట్ కు పదును చెప్పాడు, నికోలస్ పూరన్ 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. వీరిద్దరికీ మిగిలిన బ్యాట్స్ మెన్ నుంచి సహకారం లేకపోవడంతో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులే చేయగలిగింది.
68 పరుగులతో రాణించిన శ్రీలంక ఆటగాడు అసలంక కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Must Read :ఐసిసి టి-20: స్కాట్లాండ్, బంగ్లాదేశ్ విజయం