సింగపూర్ స్ట్రెయిన్ పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. కేజ్రివాల్ వ్యాఖ్యలు అత్యంత బాధ్యతా రహితమైనవని భారత విదేశాంగ శాఖా మంత్రి డా. ఎస్. జై శంకర్ అన్నారు. అయన వ్యాఖ్యలు భారత దేశంతరఫున చేసినవిగా భావించకూడదని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల రెండు దేశాల మధ్య ఉన్న ఎప్పటి నుంచో ఉన్న స్నేహపూర్వక సంబంధాలు దెబ్బతింటాయని తెలుసుకుంటే మంచిదని కేజ్రివాల్ కు హితవు పలికారు.
కోవిడ్ పై పోరులో భారత్ కు అత్యంత నమ్మకమైన భాగస్వామి సింగపూర్ అని అయన స్పష్టం చేశారు. లాజిస్టిక్స్ హబ్ గా, ఆక్సిజన్ సరఫరాదారుగా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా మనకు కావాల్సిన వైద్య పరికరాలు పంపారని, ఇది రెండు దేశాల మధ్య సౌభ్రాతృత్వానికి నిదర్శనమని జై శంకర్ పేర్కొన్నారు.
సింగపూర్ నుంచి వస్తున్న సరికొత్త స్ట్రెయిన్ చిన్నారులకు అత్యంత ప్రమాదకరమని, వెంటనే విమానాల రాకపోకలు నిలిపివేయాలని నిన్న కేజ్రివాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై సింగపూర్ తీవ్రంగా ప్రతిస్పందించింది. . సింగపూర్ లోని భారత రాయబారిని పిలిపించి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.