Perni Nani Slams Ts Minister Vemula Prasanth Reddy On Ap Debts :
తమ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం, అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్రం దగ్గర బిచ్చమెత్తు కుంటున్నామని, కానీ మాటిమాటికి ఢిల్లీ వెళ్తున్న కేసియార్ ఏం అడుక్కోడానికి వెళ్తున్నారని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ‘ఏపీ రాష్ట్రం దగ్గర డబ్బులు లేక సిఎం జగన్ కేంద్ర ప్రభుత్వం దగ్గర బిచ్చం ఎత్తుకుంటున్నారన్న’ తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలపై పేర్ని ఘాటుగా స్పందించారు. కేంద్రంలో చేరతా, నాకు మంత్రి పదవులు ఇవ్వండి అని అడుక్కుంటున్నది ఎవరని వ్యాఖ్యానించారు. ఇంటిబయట కాలర్ ఎగరేయడం, లోపల కాళ్ళు పట్టుకోవడం చేత కాదని మండిపడ్డారు.
సిఎం జగన్ కు లోపల ఒకలా, బైట మరోలా ఉండడం చేతకాదని… స్నేహం అంటే స్నేహం… ఢీ అంటే ఢీ… దోస్తీ అంటే దోస్తీ.. సై అంటే సై అనేది తమ విధానమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ అప్పుల గురించి బ్యాంకులను, అక్కడి కంట్రాక్టర్లను అడగాలని ఎద్దేవా చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో అందరి ఆదాయంతో హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తే నాటి దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విడదీసిందని, అంతటి పాడికుండను, లాభాల్లో రాష్ట్రాన్ని అప్పజేప్తే అప్పులపాలైందని దుయ్యబట్టారు. అత్త మీద కోపం దుత్తమీద చూపినట్లు, ఎవడి మీదో పడి ఏడవలేక తమ ప్రభుత్వంపై దాడి చేయడం తగదని తెలంగాణ మంత్రులు, నేతలకు నాని సూచించారు.
ఈఆర్సీ బకాయిలపై పయ్యావుల ఆరోపణలను నాని కొట్టిపారేశారు. దీనిలో కేశవ్ కొత్తగా కనిపెట్టింది ఏముందని ఎదురు ప్రశ్నించారు. టిడిపి అధికారం కోల్పోయే నాటికి డిస్కం లకు చెల్లించాల్సిన బకాయిలు 17 వేల కోట్ల రూపాయలని అప్పుడు కేశవ్ కు ఈ అప్పులు కనబడలేదా అని అడిగారు.
హంద్రీనీవా ప్రాజెక్టుపై కుప్పంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలను నాని తప్పుబట్టారు, 1989 నుంచి ఇన్నిసార్లు కుప్పం లో ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు ఏం చేశారన్నారు. లోకేష్ పీకుడు భాష మానుకోవాలని హెచ్చరించారు. కుప్పం స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలిచిందని, మున్సిపాలిటీని కూడా వైసీపీ కైవసం చేసుకుంటుందని పేర్ని ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి : మంత్రి వేముల మాటకు.. ఏపి మంత్రి తూటా…