Saturday, September 21, 2024
HomeTrending Newsఇవి పరిష్కార వేదికలు: అమిత్ షా

ఇవి పరిష్కార వేదికలు: అమిత్ షా

రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి జోనల్ కౌన్సిళ్ళు ఎంతగానో ఉపకరిస్తాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.  ఇవి కేవలం సలహా మండళ్ళుగా మాత్రమే ఏర్పాటు చేసినప్పటికీ ఎన్నో సమస్యల పరిష్కారానికి వేదికలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. తిరుపతిలో జరిగిన 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో అమిత్ షా ప్రసంగించారు. ఇలాంటి సమావేశాల ద్వారా ఉన్నత స్థాయిలో చర్చలు జరిగి పలు వివాదాలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని అభిప్రాయపడ్డారు. గత ఏడేళ్ళలో తాము 18 జోనల్ కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. రాష్ట్రాలు, కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల సంయుక్త సహకారంతోనే వివిధ జోనల్ కౌన్సిల్ సమావేశాలు విజయవంతంగా నిర్వహించగలుగుతున్నామని కొనియాడారు.

దక్షిణ భారత ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు…. భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రాచీన వారసత్వాన్ని సుసంపన్నం చేస్తాయని, దక్షిణాది రాష్ట్రాల పాత్ర లేకుండా దేశాభివృద్ధిని ఊహించలేమని స్పష్టం చేశారు. దేశంలోని అన్ని ప్రాంతీయ భాషలను మోడీ ప్రభుత్వం గౌరవిస్తోందని, ఈ సమావేశంలో కూడా వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన ప్రతినిధులు తమ మాతృభాషలోనే ప్రసంగించే అవకాశం, దాని మిగిలిన వారికి అర్ధమయ్యేలా తర్జుమా సౌకర్యం కూడా కల్పించామని చెప్పారు.

ఈరోజుకు దేశవ్యాప్తంగా 111  కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్ అందజేశామని, రాష్ట్రాల సహకారంతోనే ఇది సాధ్యపడిందని, దేశంలో సమాఖ్య స్పూర్తికిది నిదర్శనమని అమిత్ షా అభివర్ణించారు. రాష్ట్రాల మధ్య సహకారంతో పాటు పోటీ తత్వం ఉన్నప్పుడే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమన్నది ప్రధాని నరేంద్ర మోడీ అభిమతమని పేర్కొన్నారు. కోవిడ్ వచ్చిన తొలినాళ్ళలో ఈ మహమ్మారిని భారతదేశం ఎదుర్కోవడం కష్టమనే అభిప్రాయం సర్వత్రా ఉండేదని, కానీ మోడీ నాయకత్వంలో సత్వర చర్యలు తీసుకుని వైద్యరంగంలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశామని, దేశీయంగా వ్యాక్సిన్ తయారీని ప్రోత్సహించామని అమిత్ షా ఉద్ఘాటించారు. ఈ మహమ్మారిపై ఉన్న భయాలను పారద్రోలి ధైర్యంగా ఎదుర్కొన్నామని, కోవిడ్ నియంత్రణలో రాష్ట్రాలకు కేంద్రం ప్రభుత్వ సహకారం మున్ముందు కూడా ఇదే విధంగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్