ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జికావైరస్ విజృంభిస్తోంది. కాన్పూర్‌లో జికా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. కాన్పూర్ నగరంలో జికా వైరస్ కేసుల సంఖ్య 123కు చేరుకుంది. తాజాగా రాజధాని లక్నోలో మూడు కేసులు, కన్నోజ్ లో ఒక కేసు వెలుగు చూసింది. ఇప్పటి వరకు కాన్పూర్ జిల్లాకే పరిమితమైన జికా కేసులు ఇతర ప్రాంతాలకు విస్తరించటం వైద్య వర్గాల్ని ఆందోళనకు గురిచేస్తోంది. కొత్తగా జికా వచ్చిన వారిని హోమ్ ఐసోలేషన్‌లో ఉంచినట్టు యూపీ వైద్యాధికారులు వెల్లడించారు.
గర్భిణులు పిండాల్లో ఏదైనా లోపం గమనిస్తే, తక్షణమే రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం సూచనలు చేస్తోంది. యాంటి లార్వా స్ప్రేయింగ్‌తో పాటు అనుమానిత రోగులను గుర్తించే పనిలో వైద్య బృందాలు నిమగ్నమయ్యాయి. జికా వైరస్ బారినపడి తీవ్ర జ్వరంతో బాధపడుతున్న రోగులు, గర్భిణి మహిళలను గుర్తించేందుకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి కోసం వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి బాధితుల వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
జికా వైరస్ సోకిన వారిలో స్వల్పంగా జ్వరం, దద్దుర్లు, కండ్లకలక, కండరాలు, కీళ్ళ నొప్పి, తలనొప్పితో పాటు అస్వస్థతగా ఉంటుంది. వైరస్ సోకిన ఈ దోమ పగలు సమయాల్లోనే కుడుతుంది. అపరిశుభ్రత కారణంగా ఈ వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశముంది. యుపి వైద్య సిబ్బంది ప్రజలు జికా వైరస్ బారినపడకుండా.. యాంటి లార్వా స్ట్రేయింగ్ వంటి ప్రత్యేక చర్యలు చేపట్టారు.
కాన్పూర్‌లో మొదటి జికా వైరస్ కేసు అక్టోబర్ 23న నమోదయింది. నగరంలో తొలిసారిగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్)కు చెందిన వారెంట్ ఆఫీసర్‌లో వైరస్ లక్షణాలను గుర్తించారు. పరీక్షలు నిర్వహించగా అతడికి పాజిటివ్ వచ్చింది. గత కొన్ని వారాలుగా జికా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. జికా బాధితులకు చికిత్సలో ఇప్పటివరకూ ఇతర వ్యాధుల నియంత్రణకు ఉద్దేశించిన ఔషధాలను వినియోగిస్తున్నారు. దీంతో కరోనా వైరస్ కట్టడిచేసే ప్రధాన లక్ష్యంతో ఔషధాలను తయారు చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక ఫార్మా సంస్థలు పోటీ పడుతున్నాయి.