Peddireddy suggestion to Chandrababu:
చంద్రబాబు ఇకపై రాజకీయాలు వదిలిపెట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మంచిదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సలహా ఇచ్చారు. వయసు కూడా పెరిగినందున పార్టీ పగ్గాలు వేరొకరికి అప్పగించి హైదరాబాద్ కే పరిమితమైతే బాగుంటుందని బాబుకు సూచించారు. కుప్పంలో కూడా గెలవలేని పరిస్థితికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోయిందని, ప్రజలు తిరస్కరించిన విషయాన్ని చంద్రబాబు, అయన పుత్రుడు లోకేష్ ఇప్పటికైనా గ్రహించాలని హితవు పలికారు. కుప్పం నగర పంచాయతీలో వైఎస్సార్సీపీ విజయంపై పెద్దిరెడ్డి స్పందించారు.
కుప్పంలో చంద్రబాబు, లోకేష్ లు తనను, జగన్ ను ఎలా దుర్భాషలాడారో అందరూ చూశారని, తమకు సంస్కారం ఉంది కాబట్టే ఆ వ్యాఖ్యలపై స్పందించలేదని, ఫలితాల తర్వాత మాట్లాడతానని చెప్పానని పెద్దిరెడ్డి గుర్తు చేశారు. లోకేష్ అయితే ప్రచారానికి వచ్చితనను…వాడు వీడు అంటూ మాట్లాడాడని, తనను తాను రౌడీని అంటూ చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు. ఇకపై బాబు గానీ, లోకేష్ గానీ, అయన అనుచరులు గానీ ఇష్టానుసారం మాట్లాడితే సహించేది లేదని పెద్దిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికలలో కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేస్తాడని తాను అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఒకవేళ బాబు పుంగనూరు నుంచి పోటీ చేస్తానంటే ఆహ్వానిస్తానన్నారు. సిఎం జగన్ ఇన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నప్పుడు డబ్బులిచ్చి ఓట్లు కొన్నుక్కోవాల్సిన ఖర్మ తమకు పట్టలేదన్నారు.
అంతకుముందు క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పెద్దిరెడ్డి కలుసుకున్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నికలో ఘన విజయం సాధించినందుకు పెద్దిరెడ్డి, జిల్లా పార్టీ నేతలను జగన్ అభినందించారు.
Also Read : కుప్పంలో ఎగిరేది మా జెండానే: రెడ్డప్ప