JR NTR on Assembly row:
నిన్నటి అసెంబ్లీ ఘటనపై హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఈ ఘటన తన మనసును కలిచి వేసిందని వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమాల్లో ఈ మేరకు ఓ వీడియో ను విడుదల చేశారు. ఇక్కడితోనైనా ఇలాంటి సంస్కృతి ఆగిపోవాలని విజ్ఞప్తి చేశారు.
“అందరికీ నమస్కారం… మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం – రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు చాలా సర్వ సాధారణం… ఆ విమర్శలు, ప్రతి విమర్శలు ప్రజా సమస్యలమీదే జరగాలి కానీ… వ్యక్తిగత దూషణలు, లేదా వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు. నిన్న అసెంబ్లీలో జరిగినతువంటి ఒక సంఘటన నా మనసును కలిచివేసింది. ఎప్పుడైతే మనం ప్రజా సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నామో… ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి, పరుష పదజాలంతో మాట్లాడుతున్నామో… అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది. అది తప్పు. స్త్రీ జాతిని గౌరవించడం అనేది … ఆడవాళ్ళను, ఆడపడుచులను గౌరవించడం అనేది మన సంస్కృతి. మన నవనాడుల్లో, మన జవజీవాల్లో, మన రక్తంలో ఇమిడిపోయినటువంటి ఒక సంప్రదాయం. మన సంప్రదాయాలను రాబోయే తరానికి జాగ్రత్తగా. భద్రంగా అప్పజెప్పాలే గానీ, మన సంస్కృతిని అణచివేసి, కాల్చేసి… రాబోయే తరానికి ఒక బంగారు బాట వేస్తున్నమనుకుంటే అది మన తప్పు… అది మనం చేసే చాలా పెద్ద తప్పు.. ఈ మాటలు నేను ఇలాంటి ఒక వ్యక్తిగత దూషణకు గురైనటువంటి ఒక కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడడం లేదు. ఈ మాటలు నేనొక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఈ దేశానికి ఒక పౌరుడిగా, సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను. రాజకీయ నాయకులందరికీ ఒకటే విన్నపం దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి. ప్రజా సమస్యలమీద పోరాడండి, రాబోయే తరానికి బంగారు బాట వేసేలాగా, మన నడవడిక ఉండేలాగా జాగ్రత్త పడండి…. ఇది నా విన్నపం మాత్రమే. ఇది ఇక్కడితో ఆగిపోతుందని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను” అంటూ వీడియోలో మాట్లాడారు.
Also Read : నోరు అదుపులో పెట్టుకోండి : బాలయ్య