Babu in Chittoor district:
మాట తప్పను మడమ తిప్పాను అని చెప్పుకున్న సిఎం జగన్ ఎన్నో అంశాల్లో యూటర్న్ తీసుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. రాజధానిపై కూడా మాట తప్పారని, మూడు రాజధానుల బిల్లును ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించి వెంటనే త్వరలోనే మరో బిల్లు పెడతామని చెప్పడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు ఏర్పేడు మండలం పాపారాయుడు పేటలో బాధితుల సమస్యలు అడిగి తెలుగుసుకున్నారు, వారికి అందుతున్న వరద సాయంపై ఆరాతీశారు అనంతరం అక్కడకు వచ్చిన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మానవ తప్పిదంతోనే ఈ వరదలు వచ్చాయని, బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చంద్రబాబు ఆరోపించారు. వరద సహాయ కార్యక్రమాల్లో ఎక్కడా వైసీపీ ప్రజా ప్రతినిధులు కనబడడం లేదని, వరదల్లో చనిపోయిన తరువాత వచ్చి పరామర్శిస్తారా అని బాబు ప్రశ్నించారు. బాదితులను ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకోవాలని, అప్పటివరకూ తాము ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉంటామని ఉంటామని వెల్లడించారు.
ఎన్టీఆర్ కుమార్తెగా, తన భార్యగా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతున్న భువనేశ్వరిని కించపరిచేలా అసెంబ్లీలో మాట్లాడారని, ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారని అందుకే తాను ఆవేదనకు గురయ్యానని చెప్పారు. అలిపిరిలో తన కారుపై మందుపాతర పెట్టి పేల్చినా బాధపదలేదని, కానీ తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసినందునే బాధపడ్డానని అన్నారు. మీ భార్య, తల్లి, చెల్లికి ఇలా జరిగితే మీరు బాధపడరా అని ప్రశ్నించారు. అందుకే గౌరవం లేని అలాంటి కౌరవసభలో ఉండలేనంటూ బైటకు వచ్చానని, ఇకపై ప్రజాక్షేత్రంలోనే ఉంటూ వారి సంగతి తెలుస్తానని హెచ్చరించారు.
రాబోయే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చేది తామేనని, ఇప్పుడు తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని బాబు స్పష్టం చేశారు. గతంలో కూడా తనపై ఎన్నో కేసులు పెట్టారని, కానీ ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారని గుర్తు చేశారు. తనను ఏ శక్తీ ఆపలేదని బాబు వ్యాఖ్యానించారు.
Also Read : 25 లక్షల పరిహారం ఇవ్వండి: బాబు డిమాండ్