Relangi-Comedy
తెలుగు తెరకి హాస్యరసంతో అభిషేకం చేసిన తొలితరం హాస్యనటులలో రేలంగి వెంకట్రామయ్య ఒకరు. తూర్పు గోదావరి జిల్లా ‘రావులపాడు’ గ్రామంలో ఆయన జన్మించారు. మొదటి నుంచి కూడా రేలంగికి నాటకలపట్ల ఆసక్తి ఎక్కువగా ఉండేది. అందువలన ఆయనకి చదువు పెద్దగా అబ్బలేదు. ఎప్పుడూ కూడా స్నేహితులతో కలిసి నాటకాలను ప్రదర్శిస్తూ ఉండేవారు. స్టేజ్ పై ఆయన నటన ఎంతోమందిని ఆకట్టుకునేది. దాంతో స్నేహితులంతా కూడా సినిమాల్లో ప్రయత్నించమని ప్రోత్సహించారు. దాంతో సినిమా నటుడు అనిపించుకోవాలనే ఆసక్తి రేలంగిలోను పెరుగుతూ పోయింది.
మొత్తానికి తెలిసినవాళ్లను పట్టుకుని ఆయన దర్శకుడు సి.పుల్లయ్యను కలుసుకున్నారు. నటన పట్ల తనకి గల ఆసక్తిని వ్యక్తం చేశారు. పుల్లయ్యకి రేలంగి వినయ విధేయతలు నచ్చడంతో ఆయనను తన దగ్గరే పెట్టుకున్నారు. పుల్లయ్య దగ్గరే ఉంటూ ఆయన చెప్పిన పనులు చేస్తూ .. ఇచ్చిన చిన్న చిన్న వేషాలు వేస్తూ నటుడిగా రేలంగి తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అలా 1935లో ‘శ్రీకృష్ణ తులాభారం’ సినిమాతో ఆయన తెలుగు తెరకి నటుడిగా పరిచయమయ్యారు. ఆ తరువాత ఆయనకి సరైన వేషం పడి మంచి గుర్తింపు రావడానికి పుష్కరకాలం పట్టింది.
అప్పటివరకూ ఆయన ఎంతో ఓపికతో ఎదురుచూశారు .. ఎన్నో కష్టాలు పడ్డారు. ఎలాగైనా నటుడిగానే స్థిరపడాలనే బలమైన పట్టుదలతో, పెళ్లి చేసుకుని భార్యను కూడా మద్రాసు తీసుకొచ్చి కొత్త కాపురం పెట్టారు. ఆ సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులతో ఆయన సతమతమయ్యారు. అయినా ఆయన తన కష్టాన్ని నమ్ముకునే .. రేపటి రోజుపై ఆశతోనే ముందుకు వెళ్లారు. ఆయన తెచ్చిన దాంట్లోనే సర్దుకుంటూ .. మానసికపరమైన ధైర్యాన్ని ఇస్తూ భార్య కూడా అండగా నిలిచింది. దాంతో రేలంగి కష్టాలను కూడా నవ్వుతూనే ఎదుర్కొన్నారు.
1948లో వచ్చిన ‘వింధ్యారాణి’ సినిమా ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత చేసిన ‘కీలుగుర్రం’ .. ‘గుణసుందరి కథ’ .. ‘పాతాళభైరవి’ సినిమాలు రేలంగిని జనం మనసులకు చాలా దగ్గరగా తీసుకువెళ్లాయి. ఆయన డైలాగ్ డెలివరీ .. బాడీ లాంగ్వేజ్ వాళ్లకి బాగా నచ్చాయి. ఆయన కాస్త లావుగా ఉండటం వలన, భారంగానే కాళ్లు చేతులు ఆడిస్తూ చేసే డాన్సులు కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. పుల్లయ్య వంటి దర్శక దిగ్గజం దగ్గర సుదీర్ఘ కాలం పనిచేయడం వలన, కెమెరా ముందు ఎలా ఉండాలనేది ఆయనకి బాగా అర్థమైపోయింది. అందువలన ఆయన నటన చాలా సహజంగా ఉండేది.
‘పెద్ద మనుషులు’ .. ‘విప్రనారాయణ’ .. ‘మిస్సమ్మ’ .. ‘దొంగరాముడు’ .. ‘మాయాబజార్’ సినిమాలు రేలంగి స్థాయిని మరింత పెంచాయి. ఈ సినిమాలతో ఆయన స్టార్ కమెడియన్ గా మారిపోయారు. సాంఘిక చిత్రాలతో పాటు జానపద .. పౌరాణిక పాత్రలలోను తన ప్రత్యేకతను చాటుకున్నారు. ‘వెలుగునీడలు’లో వెంగళప్పగా .. ‘అప్పుచేసి పప్పుకూడు’లో భజగోవిందంగా .. ‘నర్తనశాల’లో ఉత్తరకుమారుడిగా .. ‘లవకుశలో రజకుడిగా ఆ పాత్రల్లో జీవించారు. రేలంగి స్థాయిలో ఆ పాత్రల్లో వేరొకరు మెప్పించలేరని అనుకునేలా చేశారు.
ఇక తెలుగు తెరపై హాస్యనటులకు ఒక జోడీని ఏర్పాటు చేసి, వాళ్లపై కూడా ఒక పాట ఉండేలా చూడటమనేది రేలంగితోనే పుంజుకుంది. రేలంగి – గిరిజ పెయిర్ ఒక రేంజ్ లో తెలుగు తెరపై సందడి చేసింది. ఒకానొక దశలో ఈ జోడీలేని సినిమాగానీ .. ఈ జోడీపై ఒక పాట లేని సినిమా గాని ఉండేది కాదు. హీరోహీరోయిన్ల డేట్లు కంటే కూడా రేలంగి – గిరిజ డేట్లు దొరకడం కష్టమైపోయేది. అంతలా వాళ్లిద్దరూ బిజీగా ఉండేవారు. వాళ్ల కాంబినేషన్లో వచ్చిన పాటలు చాలా వరకూ హిట్ కావడం కూడా అందుకు ఒక కారణం.
‘వినవే బాలా నా ప్రేమ గోల’ ( పాతాళ భైరవి) ‘శివ శివ మూర్తివి గణనాథా’ (పెద్దమనుషులు) ‘కాశీకి పోయాను రామా హరే’ (అప్పుచేసి పప్పుకూడు) ‘ధర్మం చెయి బాబూ’ (మిస్సమ్మ) ‘సుందరి నీవంటి దివ్య స్వరూపము'(మాయా బజార్) ‘ఇంగిలీషులోన మ్యారేజీ’ (ఆరాధన) నీనొల్లనోరి మావా నీ పిల్లని'(లవకుశ) ‘సరదా సరదా సిగరెట్టు’ (రాముడు భీముడు) ఇలా రేలంగి ఖాతాలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కనిపిస్తాయి. తెరపై రేలంగి .. గిరిజ … రమణా రెడ్డి .. సూర్యకాంతం కలిసి కనిపిస్తే చాలు ప్రేక్షకులకు పండగే.
తల్లీకూతుళ్లుగా సూర్యకాంతం – గిరిజ, మామా అల్లుళ్లుగా రమణారెడ్డి – రేలంగి స్థాయిలో మళ్లీ అంత సందడి చేసిన కాంబినేషన్ మనకి కనిపించదు. అంతగా వాళ్లు తమ పాత్రల్లో ఇమిడిపోతూ సన్నివేశాలకి సహజత్వాన్ని ఆపాదించేవారు. అందుకే అప్పటి నుంచి ఇప్పటివరకూ ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ గానే ఉండిపోయింది. జీవితంలో ఎన్నో కష్టాలను అధిగమించిన ఆయన, తన నటనకి కొలమానంగా ‘పద్మశ్రీ’ని అందుకున్నారు. తన తరువాత తరాలవారికి ఆదర్శంగా నిలిచారు. అలాంటి రేలంగి వర్ధంతి నేడు .. ఈ సందర్భంగా మనసారా ఒకసారి ఆయనను స్మరించుకుందాం.
– పెద్దింటి గోపీకృష్ణ
Also Read : తొలితరం సహాయ నటుడు