Double Bedroom For Chaitra Family :
సైదాబాద్ లోని సింగరేణి కాలనీకి చెందిన, లైంగిక దాడి, దారుణ హత్యకు గురైన చిన్నారి చైత్ర కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని యాదవ్, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ లు ప్రకటించారు. బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ మంత్రి కార్యాలయంలో చైత్ర తల్లిదండ్రులు సబావాత్ రాజు, జ్యోతి లకు ప్రభుత్వం ప్రకటించిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు పత్రాన్ని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ లు కలెక్టర్ శర్మన్ తో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 9 వ తేదీన అభం శుభం తెలియని చిన్నారి పై ఒక కామందుడు లైంగిక దాడి చేసి, దారుణ హత్య చేశాడని, ఇది చాల బాధాకరమైన సంఘటన అని పేర్కొన్నారు. సంఘటన జరిగిన వెంటనే నిందితుడి ని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టిందని వివరించారు. చైత్ర కుటుంబానికి తక్షణ సహాయంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 50 వేల రూపాయలను అందజేసినట్లు చెప్పారు. అంతేకాకుండా ప్రభుత్వం నుండి 20 లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందజేస్తామని ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. సెప్టెంబర్ 15 వ తేదీన హోం మంత్రి మహమూద్ అలీ, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ల చేతుల మీదుగా 20 లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందజేసినట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సైదాబాద్ లోని పిల్లి గుడిసెలు కాలనీలో ఇటీవల నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో ఒక ఇంటిని కేటాయిస్తూ మంజూరు పత్రాన్ని, ఇంటి తాళాన్ని ఈ రోజు చైత్ర తల్లి దండ్రులకు అందజేసినట్లు చెప్పారు. వెంటనే ఇల్లు స్వాదీనపర్చాలన్న మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు సైదాబాద్ తహసిల్దార్ ప్రసాద్ సైదాబాద్ లోని పిల్లి గుడిసెలు కాలనీలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో 514 నెంబర్ ఇంటిని సబావాత్ రాజు, జ్యోతి లకు అప్పగించారు.
Also Read : చైత్ర నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం