Funds for Somashila Repairs:
పెన్నానది దిగువన పొర్లు కట్ట నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. రెండ్రోజులుగా వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న నేడు రెండోరోజు మధ్యాహ్నం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. నెల్లూరు నగరం, భగత్ సింగ్ నగర్ లో సిఎం జగన్ పర్యటించి బాధితులను పరామర్శించారు, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత పొర్లుకట్ట శంఖుస్థాపనకు తానే స్వయంగా వస్తానని భరోసా ఇచ్చారు. అలాగే, సోమశిల ప్రాజెక్టు మరమ్మతులకు 120 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు కూడా సిఎం ప్రకటించారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. బైనాక్యులర్ ద్వారా పెన్నానది కట్ట భాగాన్ని తీక్షణంగా పరిశీలించారు.
భగత్ సింగ్ నగర్ లో వరద సాయం అందనివారు సమీప సచివాలయంలో ఈ నెల 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించిన సిఎం జగన్ బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా అధికారులు, సిఎం కార్యాలయ అధికారులు కూడా పాల్గొన్నారు.
Also Read : తిరుపతి వరద బాధితులకు సిఎం ఓదార్పు