Mediation Helps:
వివాదాలు లేని ప్రపంచాన్ని మన ఊహించలేమని, కానీ ఆ వివాదాల్ని తేలికగా పరిష్కరించుకునే వ్యవస్థ ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. డబ్బు, సమయం వృధా కాకుండా సమస్యలు పరిష్కారం కావాలని అయన అన్నారు. ఎమోషన్స్, ఈగోలు పక్కనపెట్టి వివాదాల పరిష్కారానికి అందరూ ముందుకు రావాలని పిలుపు ఇచ్చారు. హెచ్ ఐ సి సి లో మీడియేషన్, ఆర్బిట్రేషన్ పై జరిగిన అంతర్జాతీయ సదస్సుకు జస్టిస్ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అయన కాసేపు తెలుగులో మాట్లాడారు. ‘తెలుగువారు భోజనంలో పెరుగన్నం తినకపోతే ఎలా సంతృప్తి పడరో, అదే విధంగా నేను కూడా రెండు ముక్కలు తెలుగులో చెప్పకపోతే సంతోషపడను’ అని రమణ సభికుల హర్షధ్వానాల మధ్య చెప్పారు. ఈ దేశంలో ఆర్ధిక సంస్కరణలు తీసుకు వచ్చిన ప్రముఖుల్లో తెలంగాణ బిడ్డ, ప్రధాని పివి నరసింహారావు అగ్రగణ్యుడని రమణ కొనియాడారు. ఈ సంస్కరణలకు అనుగుణంగా చట్టాల్లో కూడా మార్పులు తీసుకు రావాల్సిన అవసరం వచ్చిందని, ఈ మార్పుల కోసం మరో తెలంగాణ బిడ్డ డా. పీసీ రావు ఆర్బిట్రేషన్ కన్సీలియేషన్ యాక్ట్-1996 రాశారని చీఫ్ జస్టిస్ వెల్లడించారు.
హైదరాబాద్ లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ ఏర్పాటుకు సహకరించిన తెలంగాణా ముఖ్యమంత్రి కెసియార్ కు రమణ ధన్యవాదాలు తెలియజేశారు. డిసెంబర్ 18న ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం ఉందని, పాండవులు-కౌరవుల మధ్య వివాద పరిష్కారానికి శ్రీకృష్ణుడు మధ్యవర్తిత్వం నెరిపారని రమణ గుర్తు చేశారు.
తీర్పులు చెప్పడానికి కోర్టులు, హంగామా, ఆర్భాటం అవసరం లేదని, ప్రభుత్వాలు, అధికారులు కూడా న్యాయం చేయవచ్చని, ఇదే విషయాన్ని ఇటీవల భారత రాష్ట్రపతి, ప్రధాని సమక్షంలోనే చెప్పానని రమణ గుర్తు చేశారు. సమస్యను అర్ధం చేసుకున్న, విశ్వసనీయత ఉన్న ప్రతి ఒక్కరూ తీర్పు చెప్పవచ్చని పేర్కొన్నారు.
హైదరాబాద్ లో ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు జస్టిస్ రమణకు సిఎం కెసిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. పుప్పాలగూడ వద్ద ఈ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని, సేఫ్ అండ్ సెక్యురిటీ రాష్ట్రంగా తెలంగాణా ను తీర్చి దిద్దామని కెసియార్ అన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు స్టిస్ లావు నాగేశ్వర రావు, జస్టిస్ హిమా కోష్లీ, తెలంగాణా హైకోర్టు చీఫ్ జస్టిక్ సతీష్ చంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వందన సమర్పణ చేశారు.
Also Read : విలక్షణ రాజకీయ నేత రోశయ్య