India-Korea Match Draw:
ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ-2021 పురుషుల హాకీ టోర్నమెంట్ లో ఇండియా- కొరియా జట్ల మధ్య జరిగిన ప్రారంభ మ్యాచ్ 2-2 తో డ్రాగా ముగిసింది. బంగ్లాదేశ్ రాజధాని ధాకాలోని మౌలానా భాషాని స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ నాలుగో నిమిషంలోనే ఇండియా ఆటగాడు లలిత్ గోల్ చేసి ఇండియాకు శుభారంభం అందించాడు. ఆట రెండో అర్ధభాగంలో 40వ నిమిషంలో వైస్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ మరో గోల్ చేసి భారత శిబిరంలో ఉత్సాహం నింపాడు.
ఆట మూడో పావుభాగం ముగింపుకు మూడు నిమిషాల ముందు వరుసగా వచ్చిన రెండు పెనాల్టీ కార్నర్ లను వినియోగించుకున్న కొరియా ఒక గోల్ సంపాదించింది. దీనితో స్కోరు 2-1 కి చేరుకుంది. చివరి పావుభాగం మొదలైన నిమిషానికే మరో గోల్ చేసిన కొరియా స్కోరును సమం చేసింది. మిగతా సమయం అంతా రెండు జట్లూ హోరా హరీ ఆడి ప్రత్యర్ధులకు గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. దీనితో మొదటి మ్యాచ్ డ్రా గా ముగిసింది. నేడు మొదలైన ఈ టోర్నమెంట్ డిసెంబర్ 22 వరకూ జరగనుంది.
Also Read : ఏషియన్ ట్రోఫీ సాధిస్తాం : మన్ ప్రీత్ ధీమా