Friday, September 20, 2024
HomeTrending Newsమంట కలిసిన మానవత్వం

మంట కలిసిన మానవత్వం

CEO fires 900 employees :

కార్మిక చట్టాలు, ఉద్యోగ భద్రత గాలిలో దీపాలయిన రోజులివి. చట్టం, న్యాయం సంగతి ఎలా ఉన్నా…కొంత గడువిచ్చి ఉద్యోగంలోనుండి వెళ్లిపొమ్మనడం ఇదివరకు ధర్మం. ఇప్పుడు రోజులు మారాయి. వాట్సాప్పుల్లో, వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ లో మూకుమ్మడిగా ఉద్యోగులను తొలగించే రోజులొచ్చాయి. ప్రత్యేక ఆర్థిక మండళ్లు- సెజ్ ల రాజ్యం వచ్చాక…ఆ సెజ్ లలో సాధారణ చట్టాలు, కనీస ధర్మాలు ఎప్పుడో కొడిగట్టాయి. ఇప్పుడు ఉద్యోగ భద్రత దేవతవస్త్రం కథ.

ఉద్యోగం పురుష లక్షణం” అని పూర్వం ఒక నానుడి. అయితే భారత రాజ్యాంగం “మత, వర్గ, కుల, లింగ, ప్రాంతాల ఆధారంగా వివక్ష చూపడం నేరంగా పరిగణిస్తుంది కాబట్టి.. ఇప్పుడు మనం దీన్ని ‘పురుష లక్షణం -స్త్రీ లక్షణం’ అనకుండా లక్షణంగా “ఉద్యోగం మానవ లక్షణంగా” మార్చుకొని నెమరువేసుకోవచ్చు.

అసలు ఇక్కడ “ఉద్యోగం” అంటే మనం అనుకొనే ఉద్యోగం(ఎంప్లాయిమెంట్) కాదని “ప్రయత్నం” అనేది అక్కడ కవి హృదయమని విమర్శకుల అభిప్రాయం. ఏమైనా సరే మనం దీనిని సదరు ఉద్యోగం(ఎంప్లాయిమెంట్) గానే పరిగణించి, ఇక ఆ నానుడిని “ఉద్యోగం మానవ లక్షణం” అని మన ఇష్టానికి మనం మార్చేసుకొని దాన్ని సార్వజనీనం చేద్దామంటే అభ్యంతరం పెట్టి, కళ్ళు ఎర్రచేసే వారు కూడా ఉండకపోరు. ఎందుకంటే ఏ ఉద్యోగం అవసరం లేకుండానే, ముత్తాతలు, తాతలు, తండ్రులు (మళ్ళీ లింగ వివక్ష కూడదు కాబట్టి ముత్తాతమ్మలు, తాతమ్మలు, నానమ్మలు-అమ్మమ్మలు, తల్లులు కూడా) నాలుగైదు తరాలకు సరిపోను సంపాదించి పడేసిన కుటుంబాలలో నోట్లో బంగారపుదో , వెండిదో చెంచా పెట్టుకొని పుట్టి, ఉన్నదాన్నిఖర్చుపెట్టుకోవడానికి నానా అగచాట్లు పడే వారికి “ఉద్యోగం” మానవ లక్షణం అంటే, ఏదో “ఉద్యోగం చేసి సంపాదించ వలసిన అవసరం మాకేంటని” వెంటనే కోపం పొడుచుకు రావొచ్చు.

కాబట్టి ఆ నానుడిని సార్వజనీనం చేద్దామనే ప్రయత్నం పక్కన బెడితే, అసలు భూమి మీద మానవుడిగా పుట్టి, రెక్కల్లో, పిక్కల్లో పిసరంత బలం, మెదడు లో కాస్తో-కూస్తో గుజ్జు ఏర్పడి, తల్లి-తండ్రుల రెక్కల కష్టం మీద ఇంకా ఎంతకాలం బ్రతుకుతాం అని ఆలోచించగలిగే సగటు మానవుడికి పొట్టకూటి కోసం ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోక తప్పదు. నాలుగు రాళ్ళు సంపాదించి నాలుగు మెతుకులు తన నోట్లో, నాలుగు మెతుకులు భార్య-పిల్లల నోట్లో, కొండోకచో ముసలి తల్లి, తండ్రుల నోట్లో వేయక తప్పదు.

ఇక ఉద్యోగం సంపాదించడం ఆషామాషీ కాదు. దాన్ని నిలబెట్టుకోవడం అంతా కంటే ఆషామాషీ కాదు.

వేళాపాళా లేకుండా రెక్కలు ముక్కలు చేసుకొని కమ్మరి కొలిమీ , కుమ్మరి చక్రం , జాలరి పగ్గం , సాలెల మగ్గం వంటి శరీర కష్టం స్పురింపజేసే ఉద్యోగాలు లేదా గొడ్డలి , రంపం , కొడవలి, నాగలి పట్టి పొలాలనన్నీ,హలాల దున్నీ. విరామ మెరుగక పరిశ్రమించే, బలం ధరిత్రికి బలికావించే కర్షక ఉద్యోగాలు ఒక వైపు.

గనిలో, వనిలో , కార్ఖానాలో పరిక్లమిస్తూ, పరిప్లవిస్తూ, ధనిక స్వామికి దాస్యం చేసే , యంత్రభూతముల కోరలు తోమే,
కార్మిక ఉద్యోగాలు మరో వైపు.

ఇక సగటు మానవుల అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు సమకూర్చడానికి వెలగట్టి వ్యాపారాలు చేసే ఉద్యోగాలు మరో వైపు..

వీటి అన్నింటిని మించి.. ఎవరు ఒప్పుకొన్నా, ఒప్పుకోక పోయినా..ప్రజలకు అవసరం ఉన్నాలేకున్నా ఎదో ఒక “అధికార పదవి” చేపట్టి ప్రజలకు బలవంతంగా సేవ చేసే “ప్రజాప్రతినిధి” ఉద్యోగాలు మరో వైపు..

మొత్తానికీ ఏదో ఒక ఉద్యోగం ఎంచుకొని, ఎంచుకొనే సీన్ లేకపోతే దొరికిన దాంట్లో “బ్రతుకు జీవుడా” అంటూ చేరి, బ్రతుకు బండి నడిపిస్తూ, ఢక్కామొక్కీలు తింటూ సంసార సాగరం ఈదక పోతే, మానవుడికి, జతువులకు పెద్ద తేడా ఉండదు.

ఇక ఉద్యోగాలు చేయడం అవసరం లేని వారిని, తమకు కావల్సిన ఉద్యోగం దొరకక గడ్డాలు, మీసాలు పెంచి, అరిగిపోయిన చెప్పులు వేసుకొని “సాపాటు ఎటూ లేదు, పాటైనా పాడు బ్రదర్” అంటూ కాళ్ళు ఈడుస్తూ తిరిగేవారిని పక్కన బెడితే, మనలో చాలామంది ఎవడో ఒకడు జాతికి ఉపయోగ పడుతున్నామనే మిషతోనో లేదా తనను, తన కుటుంబాన్ని ఉద్ధరించుకొందామనో పెట్టిన కంపనీలోనో, ఫ్యాక్టరీ లోనో, సంస్థలోనో, వ్యవస్థ లోనో, దానికి పబ్లిక్ సెక్టార్ అనో, ప్రైవేట్ సెక్టార్ అనో, ఆర్గనైజెడ్ సెక్టార్ అనో, అన్-ఆర్గనైజెడ్ సెక్టార్ అనో పేరు పెట్టుకొని అక్కడ పని చేసేవాడే.

ఇక ఆ వ్యవస్థలో, ఆ వ్యవస్థను ఏర్పరిచిన యజమాని ఆశయాలకు అనుగుణంగా, యజమాని లాభం, క్షేమమే ధ్యేయంగా ప్రతివాడు అక్కడ పని చేయవలసినదే. మనం చేసే పని, మన ఉనికి ఆ యజమానికి నచ్చినంత కాలమే మనం అక్కడ ఆనందంగా ఉన్నట్లు నటిస్తూ పనిచేయగలం. ఏళ్ల తరబడి యజమాని కోసం, సంస్థ కోసం కష్టపడి, ఎప్పుడో ఒకసారి యజమానికి కొద్దిపాటి కష్టమో, సంస్థకు కొద్దిగా నష్టమో కలిగించినా లేదా యజమానికి, యజమాని వారసులకు, ఆయన ఇష్టసఖులకు, మనకు ఏ మాత్రం చిన్న అభిప్రాయ భేదం వచ్చినా మన లెక్కలు సెటిల్ చేసుకొని, మూట –ముల్లె చంకలో పెట్టుకొని, బయటకు వచ్చి, మనం ఇంకో ఉద్యోగం వెతుక్కోవలసిందే.

సంస్థ ఉత్పత్తులు, లాభాలు పెరిగితే యాజమానులదో, యజమానుల వారసులదో సూక్ష్మ దృష్టి, కార్యదక్షత, కష్టపడే తత్వం, మార్కెట్ పై అవగాహన, ఆధునిక సాంకేతికత అందుబాటులోకి తేవడం వంటివి కారణం అయ్యుంటాయని మనం ప్రత్యేకం గా చెప్పుకోనవసరం లేదు. ఇక ఏ కారణం చేత అయినా ఉత్పత్తి తగ్గినా, ఉత్పత్తులకు మార్కెట్ లో డిమాండ్ తగ్గినా, యజమాన్యపు అస్తవ్యస్త పాలసీల వల్ల సంస్థ లాభాలు తగ్గినా లేదా ప్రత్యామ్నాయాలు, పర్యవసానాలు ఆలోచించకుండా దేశ కరెన్సీ రద్దు వంటి నిర్ణయాల వల్లో లేదా ప్రకృతి కన్నెర్ర చేసో లేదా కరోనా వంటి మహమ్మారి విరుచుకుపడో సంస్థ మనుగడకు కష్టం ఏర్పడితే మొట్టమొదట బాధ్యత వహించవలసినది ఉద్యోగులే. ఉద్వాసనకు గురి కావలసింది వారే. ఏళ్ల తరబడి సంస్థ కోసం పనిచేసి సంస్థతో, యజమానులతో, ఉత్పత్తులతో ఉద్యోగులు ఏర్పరుచుకొనే మానసిక, భావోద్వేగ, మానవ సంబంధాలు ఈ ఉద్వాసన సమయంలో పరిగణనలోకి ఏ మాత్రం రావు.
సంవత్సరాల తరబడి లాభాలు సంపాదించి, వ్యాపార సామ్రాజ్యాలను రాష్ట్ర, దేశ ఎల్లలు దాటించిన సంస్థలు, జాతీయ, అంతర్జాతీయ సంపన్నుల జాబితాలలో పైపైకి ఎగబాకిన వారు కూడా, వ్యాపారం లో తాత్కాలికంగా కొద్ది పాటి నష్టం వచ్చినా మొట్టమొదట చేసేది ఉద్యోగుల సంఖ్య డౌన్ సైజింగే. ఫ్యాక్టరీ లు, సంస్థలు లాకౌట్ లు ప్రకటించడం ఉద్యోగుల ఆర్ధిక స్థితిగతులను పట్టించుకోకుండా మూకుమ్మడిగా ఇంటికి పంపడం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజి కంపనీ లలో కనికరం లేకుండా అకస్మాత్తుగా “పింక్ స్లిప్” లు చేతిలో పెట్టడం కామన్ అయిపోయింది. ఇదే లోక ధర్మం అయ్యింది.
ఇక కరోనా పుణ్యమా అని సంస్థలు “వర్క్ ఫ్రమ్ హోం” మొదలు పెట్టిన తరువాత, అన్నీ ఆన్ లైన్ మీటింగ్ లు, ఆన్ లైన్ ప్రాజెక్టు లు, ఆన్ లైన్ పర్ఫార్మన్స్ రివ్యూ లు, అంతా ఆన్ లైన్ అయి కూర్చుంది. గూగుల్ మీట్లు, జూమ్ కాల్ లు, మైక్రోసాఫ్ట్ టీమ్లు వంటి ఎన్నో ఆన్ లైన్ మీటింగ్ ఆప్ లు రాజ్యమేలుతున్నాయి. ఇక పనికి, మీటింగ్ లకు మాత్రమే కాకుండా ఈ ఉద్వాసనలకు కూడా ఈ ఆన్ లైన్ మీటింగ్ ఆప్ లే వేదిక కావడం విషాదం. మొన్నటికి మొన్న ఒక అమెరికా తనఖా రుణాల కంపెని తమ సంస్థలో 15% మంది ఉద్యోగులకు ఇలా ఆన్ లైన్ లోనే ఉద్వాసన పలకడం ఒక కొత్త దుస్సంప్రదాయానికి నాంది అవుతుందేమో. మానవత్వం మంట కలవడం అంటే ఇదేనేమో!

Also Read : పరిశోధనా! నువ్వెక్కడ?

RELATED ARTICLES

Most Popular

న్యూస్