హైదరాబాద్ హుస్సేన్ సాగర్ వరద నీటి నాలాకు సంబంధించిన రక్షణ గోడ నిర్మాణ పనులకు ఫీవర్ ఆస్పత్రి వద్ద రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా రూ. 68.4 కోట్ల వ్యయంతో రక్షణ గోడ నిర్మించనున్నారు. గతేడాది వర్షాలకు నాలా పరిసరాల్లో పలు కాలనీలు జలమయం అయ్యాయి. నాలాకు రక్షణ గోడ నిర్మిస్తామని కాలనీ వాసులకు కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రక్షణ గోడ నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ గురువారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గతేడాది వర్షాలకు హుస్సేన్ సాగర్ సర్‌ప్లస్ నాలా పొంగింది. వరదలతో ప్రజలంతా ఇబ్బందులు పడ్డారు. 12 కిలోమీటర్ల మేర నాలాకు రక్షణ గోడ నిర్మించాలని కోరారు. రక్షణ గోడ నిర్మాణంతో ఇండ్లలోకి నీరు రాకుండా చేయొచ్చు. నగరంలోని నాలాలకు శాశ్వత పరిష్కారం చూపుతాం. నాలాల అభివృద్ధితో పాటు విస్తరణ పనులు కూడా చేపడుతామన్నారు. వచ్చే జూన్ నాటికి రక్షణ గోడ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాలాలపై ఉంటున్న వారికి నష్టం లేకుండా పనులు చేపడుతామన్నారు. నాలాల విస్తరణకు అందరూ సహకరించాలని కోరుతున్నాను. ఎస్ఎన్‌డీపీ కింద అన్ని జోన్లలో నాలాల విస్తరణ చేపడుతామని కేటీఆర్ ప్రకటించారు.
మొదటి దశ పనుల కింద నాలాల అభివృద్ధి కోసం రూ. 858 కోట్లను విడుదల చేశామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సికింద్రాబాద్ జోన్‌లో రూ.163 కోట్లతో, కూకట్‌పల్లి జోన్‌లో రూ. 112 కోట్ల 80 లక్షలు, ఎల్బీనగర్ జోన్‌లో రూ. 113 కోట్ల 59 లక్షలు, ఖైరతాబాద్ జోన్‌లో రూ. 100 కోట్ల 26 లక్షలు, చార్మినార్ జోన్‌లో 85 కోట్ల 61 లక్షలు, శేరిలింగంపల్లి జోన్‌లో రూ. 57 కోట్ల 74 లక్షలు. రూ. 633 కోట్ల వ్యయంతో జీహెచ్ఎంసీ పరిధిలో నాలాల అభివృద్ధి చేస్తామని కేటీఆర్ తెలిపారు.
నగర శివార్లలోని మున్సిపాలిటీల్లో మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ. 45.62 కోట్లు, బడంగ్‌పేట మున్సిపాలిటీలో రూ. 23 కోట్ల 94 లక్షలు, జల్‌పల్లిలో రూ. 24 కోట్ల 85 లక్షలు, పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీలో రూ. 32 కోట్ల 42 లక్షలు, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ. 84 కోట్ల 63 లక్షలు, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ. 13 కోట్ల 86 లక్షలు నాలాల విస్తరణకు వినియోగిస్తామని కేటీఆర్ తెలిపారు