Buggana in GST Council: రేపటి నుంచి అమలులోకి రావాల్సిన చేనేత రంగంపై జీఎస్టీ పెంపును కేంద్రం నిలిపివేయడాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్వాగతించారు. ప్రస్తుతం అమలులో ఉన్న 5 శాతం జీఎస్టీనే కొనసాగించే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకుందని, చేనేతపై జీఎస్టీ పెంపు ప్రతిపాదనను అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయని బుగ్గన వెల్లడించారు., కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈరోజు జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం అయన మీడియాతో మాట్లాడారు.
వస్త్ర పరిశ్రమపై జీఎస్టీకి సంబంధించి పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే కేంద్రం నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో కోరామని తెలిపారు. చేనేత రంగంపై జీఎస్టీ పెంపును వ్యతిరేకిస్తూ ఏపీ సిఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సమావేశంలో స్పష్టంగా చెప్పామన్నారు, దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. ఆంధ్రప్రదేశ్ లో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని, రాష్ట్రంలో 3 లక్షల మంది చేనేత కార్మికులు వస్త్ర రంగంపై ఆధారపడి ఉన్నారని బుగ్గన వివరించారు. మిగతా రాష్ట్రాల తరహాలో నైలాన్ దుస్తులు వాడకం కన్నా, కాటన్ వస్త్రాలనే ఎక్కువగా ఇక్కడ వాడతారని, కాబట్టి, చేనేత రంగంపైనా, చేనేత కార్మికులపైనా, సామాన్య, మధ్యతరగతి ప్రజలపైన జీఎస్టీ భారం ఎట్టిపరిస్థితుల్లో పడకూడదని బుగ్గన అభిప్రాయం వ్యక్తం చేశారు.
బుగ్గన మీడియాతో మాట్లాడిన ముఖ్యాంశాలు:
- రాష్ట్రానికి సంబంధించిన విభజన సమస్యలపైన కూడా చర్చించాం. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ఖర్చు 2013లో వచ్చిన భూ సేకరణ చట్టం వల్ల పెరుగుతోంది. దీనికి సంబంధించి తాజా అంచనా వ్యయాలను మంజూరు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం.
- విభజన చట్టం ప్రకారం.. రాష్ట్రానికి రావాల్సిన దుగరాజుపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, పెట్రో కెమికల్ కాంప్లెక్స్… తదితర ప్రాజెక్టులను తక్షణమే అమలు చేయాలని కోరాం. వీటికి సంబంధించి రాబోయే బడ్జెట్ లో కేటాయింపులు చేయాలని అడిగాం.
- విభజన చట్టంలో వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పరిశ్రమలు పెట్టడానికి రాయితీలు ఇవ్వాలని కోరాం. అలానే, కలహండి- బోలంగిర్- కోరాపుట్(కేబీకే), బుందేల్ ఖండ్ ప్యాకేజీను అమలు చేయాలని కోరాం. పునర్విభజనకు సంబంధించి ఇచ్చిన హామీలు, రాష్ట్రానికి ఇవ్వాల్సిన అన్ని ప్రాజెక్టులను కేంద్ర బడ్జెట్ లో పెట్టాలని కోరాం.
రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన ప్రాజెక్టులు… నడికూడి-శ్రీకాళహస్తి, కడప- బెంగుళూరు, కోటిపల్లి-నర్సాపురం, రాయదుర్గం-తుంకూర్.. వీటన్నింటినీ కేంద్రమే రైల్వే పోగ్రాంలో పెట్టి పూర్తి చేయాలని అడిగాం