Sunday, November 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅయ్యా బాబూ! టికెట్ల రేట్లు పెంచండి!

అయ్యా బాబూ! టికెట్ల రేట్లు పెంచండి!

Movie Ticket Rates: దేనికయినా సమయం రావాలి. పువ్వు పూయాలి. మొగ్గ తొడగాలి. మొగ్గ కాయవ్వాలి. కాయ పండవ్వాలి. పండు కృశించి…కృశించి విత్తనమవ్వాలి. ఇది పాప పుణ్యాల వేదాంత పాఠం కాదు. సినిమా టికెట్లు పూచి, మొగ్గ తొడిగి, కాయ కాచి, బండ్ల కెత్తిన పండ్ల పాఠం.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు భూమి రెండుగా చీలిపోయిన తక్షణ సమస్య- సినిమా టికెట్ల తగ్గింపు, పెంపు. నిజానికి సినిమా ఒక వినోదం. కల్పన. భ్రమ. హైప్. గాలిమేడ. మాయా ప్రపంచం. వ్యాపారం. వీరారాధన. ఇందులో మంచి- చెడ్డల విశ్లేషణలు ఇక్కడ అనవసరం. టికెట్లకే పరిమితమవుదాం.

వినోద వ్యయం
వినోదం ఊరికే రాదు. డబ్బు చెట్లకు కాయదు. కాబట్టి డబ్బు థియేటర్ కే కాయాలి. ఆ థియేటర్ లో ఒక్క స్క్రీన్ కే కాకుండా పాప్ కార్న్ కు, కూల్ డ్రింక్ కు, టీ కాఫీలకు అన్నిటికీ డబ్బు కాయాలి. స్క్రీన్ మీద వినోద విధ్వంసానికి బయట ఉపశమనం తిండి. థియేటర్లో తిండి అజీర్తికి ఉపశమనం లోపల స్క్రీన్ మీద ఊ అంటావా? ఊహు అంటావా? జిందాతిలిస్మాత్. ఇవి పరస్పర పోషకాలు. రెండిట్లో వ్యాపారమే. వాడు నన్ను కొట్టె…నన్ను వాడు కొట్టె…సామెతలా రెండు చోట్లా దెబ్బలు కామన్ గా మనకే తగులుతాయి.

టికెట్టు కల్పన
సినిమా తీసింది మేము. డబ్బు పెట్టింది మేము. మధ్యలో మీరెవరు టికెట్టు రేటు నిర్ణయించడానికి? వెయ్యి రూపాయలు కాకపోతే పది వేలు పెడతాం. టికెట్టు కొనండని మేమేమీ మీ కాళ్లు పట్టుకోలేదే? మా ఇష్టమొచ్చినంత రేటు పెడతాం. ఇష్టమయితే రండి. లేకపోతే పొండి. సినిమా కథ మా కల్పన. టికెట్టు ధర కూడా మా కల్పన.

నియంత్రణ భ్రమ
రోడ్డు మీద ఇరవై రూపాయల ఇడ్లి ఉంది. ఏ సి హోటల్లో రెండు వేల ఇడ్లి ఉంది. ఎవరి ఇష్టం వారిది. సినిమా టికెట్టు రేటు ఇంతే ఉండాలని మమ్మల్నే నియంత్రిస్తారా? హౌ డేర్ యూ ఆర్? ఎలా తగ్గిస్తారో చూస్తాం. మా ఐక్యత ముందు సకల వ్యవస్థలు సిగ్గుతో తల దించుకోవాలి. మా తడాఖా చూపిస్తాం. నిప్పుకే నిప్పులాంటి మేము నిప్పు రాజేస్తే ప్రభుత్వాలు మాడి మసై బూడిద కూడా మిగలదు. యూ కిరాణా కొట్స్…!

ప్రచారం హైప్
హైప్ మా ఇంటి పేరు. హైప్ మా ఊపిరి. హైప్ మా బలం. హైప్ మా యు ఎస్ పి. హైప్ లో చిక్కుకుని గింజుకోవడం మీ బలహీనత. వుయ్ కాంట్ హెల్ప్ యూ!

Cinema Ticket Rates

థియేటర్ గాలిమేడ
చట్టప్రకారం థియేటర్లో ఏమేమి ఉండి తీరాలి? అనుమతుల షరతుల్లో ఏమున్నాయి? డబ్బు పెట్టి వినోదాన్ని కొనే ప్రేక్షకుడికి థియేటర్లో ఏమేమి వసతులు ఉండాలి? ఏ హక్కులు ఉంటాయి? ఎందుకు ఉంటాయి? అన్నవి అడగకూడని ప్రశ్నలు. ఏ దిక్కూ లేక అక్కు పక్షుల్లా వచ్చిన మీరు ముందు పార్కింగ్ లో డబ్బులు కట్టండి. మొదటి రోజు మొదటి ఆట కాబట్టి టికెట్టు మీద ఐదింతలు ఎక్కువ కట్టండి. చిరు తిళ్ళకు జేబులు చిల్లులు పెట్టుకోండి. యూ బ్లడీ రిచ్ ఆడియెన్స్…మైండ్ యువర్ లిమిట్స్!

దోపిడీ మాయ
నిర్మాతను పెద్ద నటులు వాటంగా దోచాలి. పెద్ద నిర్మాతలు ఎగ్జిబిటర్లను దోచాలి. ఎగ్జిబిటర్లను థియటర్ల సిండికేట్ గుప్పిట్లో పెట్టుకోవాలి. మొత్తం సినిమా పరి పరి విధాలుగా పరిశ్రమించి పరిశ్రమగా ప్రేక్షకులను దోచుకోవాలి. ఇక్కడ “దోచుకోవడం” అన్న మాటకు వ్యవహారంలో అపప్రధ వచ్చింది కానీ…అది దానికదిగా కుదురుకున్న ఒక కంపల్షన్. “నన్ను దోచుకొందువటే…వెన్నెల థియేటర్!” అని పాడుకోవడం ఒక్కటే విజ్ఞులయిన ప్రేక్షకులు చేయాల్సిన పని.

వ్యాపారమే వ్యవహారం
వసుదేవుడంతటి వాడు అర్ధరాత్రి యమున దాటడానికి గాడిద కాళ్లు పట్టుకున్నాడు. ఆ క్షణం నుండి ఎవరు ఎవరి కాళ్లు పట్టుకోవడానికయినా ఫిలాసఫికల్ అనుమతి, అంగీకారమేదో దొరికినట్లుంది. వ్యాపారం కోసం సినిమా ఏమి చేస్తుందో చెప్పి వసుదేవుడిని తక్కువ చేయడంభావ్యం కాదు కాబట్టి…ఈ విషయాన్ని ఇక్కడికే వదిలేద్దాం.

కంచికి చేరని కథలు
బ్రిటీషు వారు రావడానికి ముందు వరకు ఉత్తర భారతంలో కాశీ, దక్షిణంలో కంచి గొప్ప విద్యా కేంద్రాలు. ఎవరికి ఏ విషయంలో వాదోపవాదాలు జరిగినా కాశీ లేదా కంచికి వెళ్లి తేల్చుకోవాలి. కంచిలో నిర్ణయమయ్యాక ఇక వాదోపవాదాలకు తావు లేదు. అలా పుట్టిన సామెతే కథ కంచికి- మనమింటికి. సినిమా ఎంత గొప్పదంటే సినిమా కథలు కంచికి చేరకుండా…లేదా చేరాల్సిన అవసరం లేకుండా…కంచే సినిమా కథలను వెతుక్కుంటూ కాళ్లు కట్టుకుని వచ్చేస్తుంది! అందువల్ల సినిమా వారి బాహుబలం ముందు మనమందరం కట్టప్పలను అడిగి మరీ పొడిపించుకోవడం తప్ప చేయగలిగింది లేదు!

మౌన ప్రేక్షకులు
తెలుగులో “మౌన ప్రేక్షకులు” మంచి మాట. మౌన ప్రేక్షకులుగా మన హద్దుల్లో మనముంటే మన ఆరోగ్యాలకే మంచిది. మనకేమి కావాలో? ఏది వద్దో? మనమెంత ఖర్చు పెట్టాలో? ఏది మనకు అత్యవసరమో? ఏది బూతో? ఏది నీతో? ఏది సభ్యతో? ఏది అశ్లీలమో? తెలుసుకోలేని మన బుర్రలేని మెదళ్లను మనమే తిట్టుకోవాల్సిన అవసరం లేదు. మన యోగక్షేమాలకు సినిమా పరిశ్రమది పూచీ! మనం నెత్తిన గుడ్డ వేసుకుని నిశ్చింతగా ఉండాలి!

కొసమెరుపు
ఇప్పుడే అందిన వార్త. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు కట్టలు తెగినట్లు, మిన్ను విరిగి మీద పడ్డట్టు రోడ్లమీదికి వచ్చి ఉద్యమిస్తున్నారు. కిరాణా కొట్ల వస్తువుల కంటే సినిమా టికెట్ల రేట్లు తక్కువగా ఉండడంతో జరిగిన అవమాన భారంతో అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. సాయంత్రం లోపు రెండు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల రేట్లను కనీసం పదింతలు పెంచకపోతే ఎక్కిన సెల్ టవర్ మీదనుండి దూకి చస్తామంటూ రెండు రాష్ట్రాలూ సెల్ టవర్ దిగకపోవడంతో…అన్ని సెల్ టవర్ల చుట్టూ ముందు జాగ్రత్తగా పెద్ద పెద్ద సర్కస్ వలలు ఏర్పాటు చేశారు. గడచిన పాతికేళ్లుగా టికెట్టు రేటు పెంచకపోవడం వల్ల జరిగిన నష్టాన్ని తమ జేబులనుండి ఇప్పటికిప్పుడే పరిశ్రమ తీసుకోకపోతే ఇళ్లకు వెళ్లేదే లేదని ప్రేక్షకులు ఎర్రటి ఎండలో, నడి రోడ్లమీద కూర్చోవడంతో జాతీయ రహదారులన్నీ స్తంభించి పోయి, ఉత్తర దక్షిణ భారతాల మధ్య సంబంధాలు తెగిపోయాయి!

ఊ అంటారా?
ఊహూ అంటారా??

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

ఈ సమస్య కొలిక్కి వచ్చేనా?

RELATED ARTICLES

Most Popular

న్యూస్