Jagan Destructive rule: రాష్ట్ర విభజన కంటే జగన్ పరిపాలన వల్లే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని ఏపీ ప్రతిపక్ష నేత, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. జగన్ నిర్ణయాలతో రాష్ట్రం కోలుకోలేని పరిస్థితికి చేరుకుందని, ఇప్పుడు మళ్ళీ కోలుకోవడానికి కూడా ఎంతో సమయం పడుతుందని అయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దారుణమైన పరిపాలన ఇన్నేళ్ళ తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం ఏపీ రాష్ట్ర కమిటీ సమావేశంలో చంద్రబాబు అధ్యక్షోపన్యాసం చేశారు. రెండేళ్లపాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్దయెత్తున పోరాడాలని నేతలు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.
రెండున్నరేళ్ళలో అన్ని వ్యవస్థలనూ జగన్ ప్రభుత్వం ధ్వంసం చేసిందని, చివరకు ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థలను కూడా భ్రష్టు పట్టించారని వ్యాఖ్యానించారు. టీడీపీకి సమస్యలు కొత్త కాదు, అధికారం కొత్త కాదని… నీ ఇప్పుడున్న సవాళ్లు మాత్రం గతంలో ఎన్నడూ ఎదురు కాలేదని చంద్రబాబు చెప్పారు. తమ పరిపాలనలో అన్ని వర్గాలకూ న్యాయం చేస్తూనే అభివృద్ధిపై కూడా పెద్ద ఎత్తున దృష్టి సారించామని గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయనీకుండా ప్రతిపక్షాలను అడ్డుకుంటున్నారని, కానీ తమ పార్టీ నేతలు ఇంటి నుంచి బైటికి వస్తే కేసులు పెడుతున్నారని విమర్శించారు. శాసనసభను ఒక బూతుల సభగా మార్చివేశారన్నారు.
జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నుంచి అయినా బైట పడొచ్చని, కానీ జగన్ వైరస్ వస్తే మాత్రం వదిలి పెట్టడం లేదని అన్నారు. శారీరకంగా, మానసికంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, కాంట్రాక్టర్లు రోడ్డునపడి బిక్షమెత్తుకునే పరిస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదని చెప్పారు. రెండేళ్లపాటు ఈ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున పోరాటం చేయాలని, స్థానిక ప్రజా ప్రతినిధుల అరాచకాలపై కూడా స్థానికంగా పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపుఇచ్చారు. కార్యకర్తలకు ధైర్యం ఇవ్వాల్సిన అవసరం నాయకులపై ఉందని సూచించారు.
Also Read : డైవర్షన్ పాలిటిక్స్ పనిచేయవు: చంద్రబాబు