No early elections: ప్రతిపక్షాలు ముఖ్యంగా చంద్రబాబు ఎన్ని శాపనార్ధాలు పెట్టినా, ఎన్ని కుట్రలు చేసినా తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ యజ్ఞం ఆపే ప్రసక్తే లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. కోవిడ్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కొంత తగ్గిందని, అయినా సరే ఎక్కడా సంక్షేమ పథకాలు ఆపలేదన్నారు. చంద్రబాబు ఎన్ని తిట్లు తిట్టినా అవి తమ ప్రభుత్వానికి ఆశీస్సులే అవుతాయన్నారు. ప్రజల కోణం నుంచి ఆలోచించి వారికి ఎలాంటి కార్యక్రమాలు కావాలో వాటిని సిఎం జగన్ అమలు చేస్తున్నారని, దీనిపై చంద్రబాబు ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు హర్షిస్తున్నారని, చంద్రబాబు ఇన్నేళ్లపాటు పరిపాలించినా ఆయన్ను గుర్తుంచుకోవడానికి కనీసం ఒక్క కార్యక్రమమమైనా ఉందా అని ప్రశ్నించారు.
ఇప్పటికీ చంద్రబాబు ఒంటరిగా పోరాడే ధైర్యం చేయలేకపోతున్నారని సజ్జల ఎద్దేవా చేశారు. మరోసారి పొత్తులతో ఎన్నికలకు సిద్ధమవుతున్నారని, పోత్తులకు తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని సిగ్గు లేకుండా చంద్రబాబు చెప్పడం చూస్తుంటే ఆయనపై ఆయనకే నమ్మకం లేనట్లు మరోసారి వెల్లడవుతుందని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
ప్రజల్లో విఫలమైన నేతలను, కొన్నిచోట్ల సరిగా పని చేయని నియోజకవర్గాల ఇన్ చార్జ్ లను మారుస్తానని తమ పార్టీ నేతలకు చంద్రబాబు చెబుతున్నారని, ఆ మాటకొస్తే చంద్రబాబునే మార్చాల్సి ఉంటుందని, స్థానిక ఎన్నికల్లో కుప్పంలో ఆ పార్టీ దారుణంగా పరాజయం చెందిదని గుర్తు చేస్తూ కుప్పంలో కూడా అభ్యర్ధిని మార్చాల్సి ఉంటుందని సజ్జల సూచించారు.
ముందస్తు ఎన్నికల ఆలోచనే లేదని, ప్రజలిచ్చిన తీర్పును వైఎస్ జగన్ సద్వినియోగం చేసుకుంటారని సజ్జల వెల్లడించారు. ఐదేళ్ల పూర్తి కాలం కొనసాగుతామని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. ఆరు నెలలు ముందుగా వెళితే తమకు ప్రయోజనం ఉంటుందన్న భావనతో కొన్ని పార్టీలు ముందస్తుకు వెళతాయని కానీ తమకు ఆ అవసరం లేదని తేల్చి చెప్పారు. గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను రెండేళ్ళలోనే పూర్తి చేశామని సజ్జల వివరించారు.
Also Read : మందు బాబుల దేశ సేవ