Sunday, January 19, 2025
HomeTrending Newsలక్ష దాటిన కరోనా కేసులు

లక్ష దాటిన కరోనా కేసులు

Corona Cases One Lakh : దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. కొత్త కేసులు లక్ష దాటేశాయి. కేసులు 10 రోజుల వ్యవధిలో 13 రెట్లు పెరిగి, ఆందోళన కలిగిస్తున్నాయి. మూడో వేవ్‌కు ఆజ్యం పోస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు మూడు వేలకు పెరిగాయి. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.
నిన్న 15,13,377 మంది కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 1,17,100 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైరస్ ఉద్ధృతిలో ఆకస్మిక పెరుగుదల కనిపిస్తోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 7.74 శాతానికి చేరింది. మహారాష్ట్రలో గురువారం 36,265 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. ఒక్క ముంబయి నగరంలోనే 20,181 కేసులు బయటపడ్డాయి. పశ్చిమబెంగాల్‌లో 15,421; దిల్లీలో 15,097 కేసులు నమోదయ్యాయి. దేశ రాజధానిలో పాజిటివిటీ రేటు ఏకంగా 15.34% శాతానికి పెరిగింది. అధిక సంఖ్యలో పరీక్షలు జరుపుతుండటం వల్లే దిల్లీలో కేసులు పెరుగుతున్నట్లు దిల్లీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ తెలిపారు. దేశంలో మొత్తం కేసులు 3.52 కోట్లుగా ఉన్నాయి.
దేశంలో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఆ కేసులు 3,007కి చేరాయి. కొత్తగా 377 మందిలో కొత్త వేరియంట్‌ను గుర్తించారు. అత్యధికంగా మహారాష్ట్రలో 876 మంది దీని బారినపడ్డారు. దిల్లీలో ఆ సంఖ్య 465కి చేరింది. మూడు వేల మందిలో 1,199 మంది కోలుకొని, ఇళ్లకు చేరుకున్నారు. 27 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వేరియంట్ వ్యాపించింది.
ఒక్కరోజులో 3 లక్షల చేరువ నుంచి 4 లక్షల చేరువకు..కరోనా మహమ్మారి విజృంభణ క్రియాశీల కేసులపై పడింది. నిన్న 3 లక్షలకు చేరువలో ఉన్న క్రియాశీల కేసులు కాస్తా తాజాగా నాలుగు లక్షల చేరువకు వెళ్లాయి. ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య 3,71,363కి పెరిగింది. క్రియాశీల రేటు ఒక శాతం దాటి..1.05 శాతానికి చేరింది. నిన్న ఒక్కరోజే 30 వేల మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ 3.43 కోట్లమంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. రికవరీ రేటు 97.57 శాతానికి పడిపోయింది.
గత 24 గంటల వ్యవధిలో 302 మరణాలు సంభవించాయి. ఈ రెండేళ్ల వ్యవధిలో 4.8 లక్షల మంది మృత్యుఒడికి చేరుకున్నారు. నిన్న 94.4 లక్షల మంది కరోనా టీకా తీసుకున్నారు. నిన్నటివరకూ పంపిణీ అయిన డోసుల సంఖ్య 149 కోట్ల మార్కు దాటేసింది. జనవరి మూడు నుంచి కరోనా టీకా కార్యక్రమంలో మరో దశ ప్రారంభమైంది. ఈ నాలుగు రోజుల వ్యవధిలో 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులకు 1.64 కోట్ల డోసులు అందాయి.

Also Read : మ‌హేష్ బాబుకు క‌రోనా పాజిటివ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్