Protests Sudan : సుడాన్ లో మిలిటరీ పాలకులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ఆగటం లేదు. రాజధాని ఖార్తూమ్ తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రధానమంత్రి అబ్దల్లా హందోక్ స్వచ్చందంగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించటంతో ఆందోళనలు హింసరూపం సంతరించుకుంటున్నాయి. మిలిటరీ ఒత్తిడి వల్లే ప్రధాని రాజీనామా నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తూ సుడాన్ వ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు ఆందోళనలు, నిరసన ప్రదర్శనలకు పిలుపుఇచ్చారు. పౌర ప్రభుత్వాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ఒక దశలో ఆందోళనకారులు దేశాధ్యక్ష భవనాన్ని ముట్టడించే ప్రయత్నం చేయగా మిలిటరీ నిలువరించింది. ఖార్తూమ్ లో జరిగిన ఆందోళనల్లో ఇద్దరు ప్రదర్శనకారులు చనిపోగా వందలమంది పోలీసులు గాయపడ్డారు. నిరసనలు తీవ్రరూపం దాల్చడంతో ఖార్తూమ్ లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. రాజధానికి వచ్చే అన్ని రహదారులు, మార్గాలను మూసివేశారు.
ప్రజాస్వామ్యవాదుల్ని వేలసంఖ్యలో అరెస్టు చేసిన మిలిటరీ పాలకులు నిర్భందంలో ఉంచారు. మిలిటరీ అనైతిక చర్యలకు పాల్పడుతోందని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు విమర్శించాయి. గత ఏడాది అక్టోబర్ 25వ తేదిన పౌర ప్రభుత్వాన్ని కూల్చివేసి మిలిటరీ చీఫ్ అబ్దేల్ ఫతః అల్ బుర్హాన్ నేతృత్వంలో సైన్యం అధికారం హస్తగతం చేసుకుంది. ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో నెల తర్వాత నవంబర్ 21వ తేదిన మిలిటరీ, ప్రధాని అబ్దల్లా హందోక్ లు సంయుక్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని ప్రకటించింది. అయితే నెలన్నర నుంచి చర్చలు జరుగుతున్న సైన్యం షరతులకు ప్రధానమంత్రి అబ్దల్లా హందోక్ తలోగ్గలేదు. ప్రభుత్వంలో, విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామ్యం ఉంటేనే సైన్యానికి సహకరిస్తామని అబ్దల్లా హందోక్ తెగేసి చెప్పారు. పౌర ప్రభుత్వ పునరుద్దరనపై ప్రధాని అబ్దల్లా హందోక్ మిలిటరీతో గత రెండు నెలలుగా చర్చలు జరిపినా కొలిక్కి రాలేదు. దీంతో చర్చలు కొలిక్కి రాక సైన్యం దిగిరాకపోవటంతో అబ్దల్లా హందోక్ జనవరి రెండున ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రధాని రాజీనామాతో దేశవ్యాప్తంగా నిరసన సెగ అంటుకుంది.
Also Read : సుడాన్ లో మిలిటరీ తిరుగుబాటు