రాష్ట్ర ప్రభుత్వాలకు రెమ్ డెసివర్ పంపిణీని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలే ఈ మందు కొనుగోలు చేసుకోవాలని సూచించింది. రెమ్ డెసివర్ ఉత్పత్తి పెరగడంతో రాష్ట్రాలు నేరుగా తెప్పించుకోవచ్చని తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ మందు అందుబాటును ఎప్పటికప్పుడు పర్యవేక్షించనుంది. అత్యవసర వినియోగం కోసం 50 లక్షల డోసులను కేంద్రం కొనుగోలు చేసి తన వద్ద ఉంచుకోనుంది.
దేశవ్యాప్తంగా కోవిడ్ కేసుల్లో కూడా తగ్గుదల కనిపించింది. గత 24 గంటల్లో లక్షా 73 వేల కేసులు నమోదయ్యాయి. గత 45 రోజుల్లో రోజువారీ కేసుల్లో పోలిస్తే ఇవి తక్కువ.
గత ఏప్రిల్ 11 నుంచి మే 29 నాటికి రెమ్ డెసివర్ రోజువారీ ఉత్పత్తి పదిరెట్లు పెరిగిందని, గతంలో ౩౩ వేలు మాత్రమే తయారుకాగా నేడు మూడున్నర లక్షల ఇంజెక్షన్లు తయారవుతున్నాయని కేంద్ర ఎరువులు రసాయనాల శాఖా మంత్రి మన్సూక్ మాండవీయ వెల్లడించారు. ఒకప్పుడు 20 ప్లాంట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తుండగా, నేడు 60 ప్లాంట్లు నడుస్తున్నాయన్నారు.
ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమైన కోవిడ్ రెండో దశలో రెమ్ డెసివర్ మందుకు విపరీతమైన గిరాకీ ఎర్పటింది. దేశంలో చాలా చోట్ల ఈ మందును బ్లాక్ మార్కెట్ లో విక్రయించారు. కోవిడ్ తీవ్రదశలో వున్న వారికి వినియోగించాల్సిన మందును చాలామంది అవసరం లేకపోయినా ముందు జాగ్రత్త కోసం లక్షల రూపాయలు పెట్టి మరీ కొనుక్కునారు. దీంతో ఈ మందుకు తీవ్రమైన కొరత ఏర్పడింది.