Committee on issues: మత్స్యకారుల సమస్యలపై జిల్లా అధికారులు, మత్స్యకార పెద్దలతో ఓ కమిటీ నియమించామని, ఈ కమిటీ నివేదిక ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖా మంత్రి డా. సీదిరి అప్పలరాజు వెల్లడించారు. ఈనెల 20 లోపు కమిటీ నివేదిక ఇస్తుందని తెలిపారు. రేపటినుంచి నిబంధనల ప్రకారం వేట కొనసాగించవచ్చని, హైకోర్టు ఆదేశాల ప్రకారం రింగు వలల వేట కొనసాగించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, బొట్లు, వలలు సీజ్ చేస్తామని మంత్రి హెచ్చరించారు.
మత్స్యకార గ్రామాల్లో 144,145 సెక్షన్ ఎత్తివేస్తామని సీదిరి హామీ ఇచ్చారు. రింగు, సంప్రదాయ వలల వివాదంపై మత్స్యకారుల్లో విభేదాలు తలెత్తాయి. ఈ సమస్యపై అధికారులు జరిపిన చర్చలు ఫలించలేదు. దీనితో మంత్రులు, ఎంపీలు రంగలోకి దిగారు. విశాఖ జిల్లా కలెక్టరేట్ లో ఇరు వర్గాల పెద్దలతో జిల్లా ఇన్ చార్జ్ మంత్రి కురసాల కన్నబాబు, మంత్రులు డా. అప్పలరాజు, అవంతి శ్రీనివాసరావు, ఎంపీలు విజయసాయి రెడ్డి, ఎంవీవీ సత్యనారాయణలు సమావేశం నిర్వహించారు.