Cape Town Test: సౌతాఫ్రికాతో జరుగుతోన్న మూడో టెస్టులో ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 223 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కేప్ టౌన్ లోని న్యూల్యాండ్స్ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జట్టులో రెండు మార్పులు చేశారు. కోహ్లీ జట్టులోకి రావడంతో హనుమ విహారీని తప్పించారు. సిరాజ్ గాయం కారణంగా వైదొలగడంతో ఉమేష్ యాదవ్ కు చోటు దక్కింది.
ఓపెనర్లు కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ నిరాశ పరిచారు. జట్టు స్కోరు 31 వద్ద రాహుల్ (12); 33 వద్ద మయాంక్ (15) ఔటయ్యారు. పుజారా-కోహ్లీ మూడో వికెట్ కు కాస్త నిలదొక్కుకుని ఆడుతున్నట్లు కనిపించినా 45 పరుగులు చేసిన పుజారా మార్కో జెన్సేన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత వచ్చిన వారిలో పంత్ ఒక్కడే కాసేపు క్రీజులో నిలిచాడు, మిగిలిన వారంతా త్వరగా ఔటయ్యారు. 79 పరుగులు చేసిన కోహ్లీ తొమ్మిదో వికెట్ గా వెనుదిరిగాడు. సౌతాఫ్రికా బౌలర్లలో రబడ నాలుగు; మార్కో జాన్సేన్ మూడు; ఒలివియర్, నిగిడి, మహారాజ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
తొలి రోజే మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన సౌతాఫ్రికా ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 17 పరుగులు చేసింది. కెప్టెన్ ఎల్గర్ ను బుమ్రా అవుట్ చేశాడు.