We will Fight: వ్యవసాయ రంగం, రైతుల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని, ఈ విషయంలో కేంద్రం తన తీరు మార్చుకునే వరకూ టిఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. దొంగ చట్టాల పేరుతో రైతులను బిజెపి మోసం చేస్తోందని మండిపడ్డారు. టిఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్సీలు ఎల్. రమణ, దండే విఠల్, గంగాధర్ గౌడ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు. రైతులకు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత మేలు జరుగుతోందో, బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో చర్చకు రావాలని బిజెపి నేతలకు సవాల్ చేశారు. పెట్రోలు, డీజిల్ రెట్లు పెంచి రైతుల నడ్డి విరిచిన కేంద్రం తాజాగా ఎరువుల రేట్లు కూడా పెంచి వారిని మరింత ఇబ్బంది పెడుతోందని ధ్వజమెత్తారు. ఎరువుల రేట్లపై బిజెపి నేతలు మాట్లాడుతున్న తీరు దారుణమన్నారు. ఎరువుల రేట్లు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని ఎన్నిసార్లు విన్నవించినా కేంద్రం స్పందించడం లేదని గుర్తు చేశారు.
ఈ దేశాన్ని ఎక్కువకాలం పరిపాలించిన కాంగ్రెస్, బిజెపిలు వ్యవసాయ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేశాయని ఎర్రబెల్లి విమర్శించారు. కానీ కెసియార్…. నాటి దేవీలాల్, చరణ్ సింగ్ ల కంటే ఒక అడుగు ముందుకేసి రైతాంగానికి అనుకూలంగా ఎన్నో చర్యలు తీసుకున్నారని కొనియాడారు. గతంలో తెలంగాణా ఎడారిగా మారడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని, ఎస్సారెస్పీని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.