రెండేళ్ళ పరిపాలనలో సిఎం జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాని నాని ప్రశంసించారు. రెండేళ్ళ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, 2014 లోనే జగన్ కు అధికారం ఇచ్చి ఉంటే బాగుండేదని…చంద్రబాబును గెలిపించి తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని మంత్రి వెల్లడించారు. రెండేళ్ళ పరిపాలనా కాలంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్యమాలను చేపట్టామని, 1.31 లక్షల కోట్ల రూపాయల సంపదను పేదలకు పంపిణీ చేశామని వివరించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని… విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.
కరోనా సమయంలో కూడా ముఖ్యమంత్రి జగన్ అనేక వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. కరోనాతో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు 10 లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని మొదట జగన్ ప్రకటిస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. మరో ౩౦ ఏళ్ళపాటు జగన్ ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని నాని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవలి స్థానిక ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, జగన్ దెబ్బకు చందబాబు జూమ్ యాప్ కు పరిమితమయ్యారని అన్నారు.
2014లో చంద్రబాబుకు అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని కుక్కలు చిపిన విస్తరి చేశారని, రాజధాని పేరుతో అధికారాన్ని తన సొంత మనుషులు, వ్యవస్థలకు దోచిపెట్టారని నాని విమర్శించారు. ఎన్టీఆర్ కు భారతరత్న రాకుండా చేసిందే చంద్రబాబు అని నాని ఆరోపించారు. ఇప్పుడు మాత్రం ప్రతి ఏడాదీ ఎన్టీఆర్ పుట్టినరోజున ఆయనకు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేయడం చంద్రబాబు కపట రాజకీయానికి నిదర్శనమన్నారు.