రాష్ట్రంలో లాక్ డౌన్ ను పోదిగించవద్దని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపి అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఈనెల 12వ తేదీ నుంచి లాక్ డౌన్ అమలవుతోంది. నేడు రాష్ట్ర క్యాబినెట్ సమావేశమై లాక్ డౌన్ పొడిగింపుపై సమీక్షించనుంది. ఈ నేపధ్యంలో అసద్ ప్రభుత్వానికి ట్విట్టర్ ద్వారా పలు సూచనలు చేశారు. లాక్ డౌన్ తో పేదలు తీవ్రమైన కష్టాలు పడుతున్నారని, కేవలం నాలుగు గంటల సడలింపుతో మూడున్నర కోట్ల మంది ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు.
రద్దీ తగ్గించాలనుకుంటే సాయంత్రం 6 గంటల నుంచి కర్ఫ్యూ విధించవచ్చని, పూర్తి లాక్ డౌన్ తో రోజువారీ కూలీలు, పేదల ఉపాధి అవకాశాలు దెబ్బతీయవద్దని కోరారు. కరోనాను అరికట్టేది కేవలం వ్యాక్సిన్ మాత్రమేనని. లాక్ డౌన్ తో సంబంధం లేకుండానే రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుతున్నాయని అసద్ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. లాక్ డౌన్ పేదల పాలిట నరకంగా మారిందని, పొడిగిస్తే పేదల బతుకులు రోడ్డు పాలవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
లాక్ డౌన్ వేళల్లో పోలీసుల వేధింపులు ఎక్కువయ్యనని, దీనివల్ల శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కరోనా వ్యాధితో సుదీర్ఘ పోరాటం చేయాల్సి ఉంటుదని, దానికి తగిన వ్యూహాలు రూపొందించుకోవాలి తప్ప లాక్ డౌన్ వల్ల ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. మాస్కులు, భౌతిక దూరం పై ప్రజల్లో అవగాహన కలిగించాలని సిఎంఓ ను ఉద్దేశిస్తూ అసద్ ట్వీట్ చేశారు.