Shantha Kumari: తెలుగు సినిమా తొలినాళ్లలో వెండితెరకి పరిచయమైన కథానాయికలలో శాంతకుమారి ఒకరు. అప్పట్లో తెలుగు సినిమాకి సంబంధించి రెండు పేర్లు ప్రధానంగా వినిపించేవి. ఒకరు శాంతకుమారి అయితే మరొకరు కన్నాంబ. ఈ ఇద్దరిలో రౌద్రరసానికి కన్నాంబ కేరాఫ్ అడ్రెస్ గా కనిపిస్తే, కరుణ రసానికి శాంతకుమారి పేరు ప్రత్యామ్నాయంగా వినిపిస్తుంది. తెరపై శాంతకుమారి ప్రశాంతతకు ప్రతీకగా కనిపించేవారు. అప్పుడప్పుడు గయ్యాళి పాత్రలను పోషించి మెప్పించిన ఘనత కూడా ఆమె సొంతం. శాంతకుమారి డైలాగ్ డెలివరీ .. కళ్లతోనే హావభావాలను పలికించే తీరు ప్రేక్షకులను కట్టిపడేసేది.
శాంతకుమారి ఇంటిపేరు వెల్లాల .. ఆమె అసలు పేరు సుబ్బమ్మ. కడప జిల్లా ‘ప్రొద్దుటూరు‘లో ఆమె జన్మించారు. సినిమాల్లోకి వచ్చిన తరువాతనే శాంతకుమారిగా ఆమె పేరును మార్చడం జరిగింది. చిన్నప్పటి నుంచి శాంతకుమారి చాలా చురుకుగా ఉండేవారు. ఆమె కళ్లు ఎంతో ఆకర్షణీయంగా ఉండేవి ఆమె స్వరం బాగుంటుందని అంతా అంటూ ఉండటంతో, ఆమెకి సంగీతాన్ని నేర్పించాలనే ఉద్దేశంతో తండ్రి ఆమెను మద్రాసుకు తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆమె సంగీతంలో మంచి ప్రతిభను కనబరచడమే కాకుండా, పిల్లలకు సంగీత పాఠాలు చెబుతూ ఉండేది.
అలాంటి సమయంలోనే ఆమెకి సినిమాల నుంచి అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. అలా శశిరేఖా పరిణయం ప్రధానంగా సాగే ‘మాయా బజార్‘ (1936)లో నటించే అవకాశం వచ్చింది. పీవీ దాసు దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఆ సినిమా తరువాత ఆమె ఇక వెనుదిరిగి చూసుకోలేదు. మంచి రూపం .. అభినయానికి అనువైన కళ్లు .. చక్కని గాత్రం ఉండటం వలన శాంతకుమారిని వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆ తరువాత చేసిన ‘ధర్మదాత‘ .. ‘రుక్మిణీ కల్యాణం‘ .. ‘సారంగధర‘ సినిమాలు ఆమెకి మంచి పేరును తెచ్చుపెట్టాయి.
బండా కనకలింగేశ్వర రావు కథానాయకుడిగా పి.పుల్లయ్య ‘సారంగధర‘ను తెరకెక్కించాడు. ఈ సినిమా సమయంలోనే పుల్లయ్య – శాంతకుమారి మధ్య పరిచయం ప్రేమగా మారడం .. వారు వివాహం చేసుకోవడం జరిగిపోయింది. వివాహం తరువాత కూడా వాళ్లిద్దరూ చాలా సినిమాలకు కలిసి పనిచేశారు. తొలితరం కథానాయికలలో తన పాత్రకి తానే పాటలు పాడుకున్న అతి తక్కువమందిలో శాంతకుమారి ఒకరు. ‘గుణసుందరి కథ‘ సినిమాలో ‘చల్లనిదోరవేలే చందమామ‘ అనే పాట అప్పట్లో అందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకుంది. అదే విధంగా ‘సిరి సంపదలు‘ సినిమా కోసం ఆమె పాడిన ‘చిట్టి పొట్టి పాపలు .. చిరు చిరు నవ్వుల పువ్వులు‘ పాట కూడా అప్పట్లో పెద్ద హిట్.
ఇక శాంతకుమారి అనగానే అందరికి గుర్తుకు వచ్చే పాట ఒకటి ఉంది. అది ‘శ్రీ వేంకటేశ్వరమహాత్మ్యం‘ సినిమాలోని ‘ఎన్నాళ్లని నా కన్నులు కాయగా ఎదురుచూతురా గోపాలా‘ అనే పాట. అప్పట్లో ఈ పాట విని పరవశించని మనసులు లేవు. ఇప్పుడు కూడా భక్తి గీతాలలో ఈ పాట ముందువరుసలో కనిపిస్తుంది. ‘వకుళమాత‘గా ఆమె ఈ పాట పాడుతూ ఉండగానే, వేంకటేశ్వరస్వామిగా ఎన్టీఆర్ ఆమె ఆశ్రమానికి వస్తారు. ఆ సినిమాలో శాంతకుమారిని చూసినవారెవరైనా వకుళమాత ఇలానే ఉండేదేమోనని అనుకుంటారు.
ఆ సినిమాలో శ్రీనివాసుడు .. పద్మావతిదేవికి మనసిచ్చాడని తెలిసి ఆమె ఆందోళనకి లోనవుతుంది. ‘అడవులకు అంతః పురాలతో వియ్యమా నాయనా” అంటూ స్వామికి నచ్చేజెప్పే సన్నివేశంలో ఆమె నటన మనసు మైదానంలో నాటుకుపోతుందంతే. ఈ సినిమాలో శాంతకుమారి పాత్ర .. ఆ పాట .. ఆమె కెరియర్లోనే ప్రత్యేకమైన స్థానంలో నిలిపోయాయి. ఇక సాంఘికాలలో ఆమె నటనకు కొలమానంగా నిలిచే సినిమా ‘తల్లా పెళ్లామా‘ నిలుస్తుంది. పెళ్లాల మాటలు విని తనని కొడుకులు వదిలేసి వెళ్లిపోవడంతో, ఒంటరిగా జీవనాన్ని కొనసాగించే పాత్రలో ఆమె నటన కన్నీళ్లు పెట్టిస్తుంది .. కదిలించివేస్తుంది.
ఇలా ఒకటేమిటి శాంతకుమారి సినిమాలను గురించి .. ఆమె చేసిన నట విన్యాసం గురించి చెప్పుకోవడమంటే, సముద్రాన్ని దోసిట్లో పట్టాలనుకోవడమే అవుతుంది. శాంతకుమారి తరువాత ఇండస్ట్రీకి వచ్చి స్టార్ స్టేటస్ ను అందుకున్న వాళ్లంతా కూడా ఆమె పట్ల ఎంతో గౌరవ మర్యాదలతో ఉండేవారు. వాళ్లలో చాలామందికి ఆమె తల్లి పాత్రలను పోషించారు. ఒక వైపున ఇతర బ్యానర్లలో నటిస్తూనే, మరో వైపున భర్తతో కలిసి ఆమె 20కి పైగా సినిమాలను నిర్మించారు. శాంతకుమారి చూపించే ఆప్యాయత .. ఆ సంస్థ పారితోషికాలు చెల్లించే తీరు వలన, ఆ బ్యానర్లో పనిచేయడానికి అంతా ఆసక్తిని చూపించేవారు.
తన సొంత సినిమాల నిర్మాణ సమయంలో సెట్లో అందరినీ కూడా ఆమె ఒకే రంకంగా చూసేవారట. తన వలన ఎవరూ మనసు నొచ్చుకోకూడదు అన్నట్టుగా ఆమె చాలా సున్నితంగా ప్రవర్తించేవారని అంటారు. అలాగే ఎవరు ఎలాంటి కష్టంలో ఉన్నప్పటికీ ఆదుకోవడానికి ఆమె ముందుకు వచ్చేవారని చెబుతారు. అందువలన ఆమెను అంతా ‘అమ్మా‘ అనే పిలిచేవారట. తల్లి పాత్రల్లో నిజంగానే అంతటి అనురాగాన్ని ఆవిష్కరించే ఆర్టిస్టును తాము చూడలేదని ఎన్టీఆర్ .. ఏఎన్నార్ ఆయా సందర్భాల్లో చెప్పడం విశేషం. వాళ్లు కూడా ఆమె పట్ల అంతే అభిమానంతో నడచుకునేవారట. రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్న ఆ నటీమణి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా మనసారా ఆమెను ఓ సారి స్మరించుకుందాం.
(శాంతకుమారి వర్ధంతి ప్రత్యేకం)
— పెద్దింటి గోపీకృష్ణ
Also Read : ముందు చూపున్న అందగాడు శోభన్ బాబు