Acharya date confirmed: చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ ‘ఆచార్య‘ సినిమాను రూపొందించారు. నిరంజన్ రెడ్డి – చరణ్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో, చిరూ సరసన నాయికగా కాజల్ కనిపించనుంది. ఇక ఈ సినిమాలో ‘సిద్ధా’ పాత్రను చరణ్ పోషించగా, ఆయన జోడీగా ‘నీలాంబరి’ పాత్రలో పూజ హెగ్డే అందాల సందడి చేయనుంది. దేవాలయ భూముల ఆక్రమణ .. అందుకు పాల్పడిన అవినీతిపరులపై పోరాటమే ఈ సినిమా.
చిరంజీవి – చరణ్ నక్సలైట్స్ పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకి, మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు. ఇంతవరకూ ఆయన నుంచి వచ్చిన ‘లాహే లాహే’ .. ‘నీలాంబరి’ .. ‘సానా కష్టం’ పాటలకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. భారీ తారాగణంతో నిర్మితమైన ఈ సినిమాను ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అయితే కరోనా తీవ్రత ఎక్కువ ఉన్న కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేసినట్టుగా రీసెంట్ గా మేకర్స్ ప్రకటించారు.
దాంతో మెగా అభిమానులంతా కూడా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ఉంటుందా అనే కుతూహలానికి లోనయ్యారు. తాజాగా ఈ సినిమా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. రిలీజ్ డేట్ తో కూడిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఏప్రిల్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు చెప్పారు. కథాకథనాల పరంగా .. పాటల పరంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందనేది చూడాలి.