Sankranthi Winner: గ్రామీణ నేపథ్యంతో కూడిన కథలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుందని నిరూపించిన చిత్రాలలో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఒకటి. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఆ సినిమా, 2016 సంక్రాంతి బరిలో విజేతగా నిలిచింది. ఆ సినిమాలోని ‘బంగార్రాజు‘ పాత్ర ఒక రేంజ్ లో ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. దాంతో అదే పాత్ర చుట్టూ మరో కథను అల్లుకుని, మరో హిట్ కొట్టాలని నాగార్జున భావించారు. అదే దర్శకుడితో .. సంగీత దర్శకుడితో రంగంలోకి దిగారు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది.
ఇక మొత్తానికి ఈ కథను పట్టుకుని నాగార్జున అండ్ టీమ్ సెట్స్ పైకి వెళ్లింది. ఈ కథ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. సంక్రాంతి పండుగ వాతావరణానికి చాలా దగ్గరగా ఉంటుంది. అందువలన ఈ సినిమాను సంక్రాంతి ముగ్గులోకి దింపడమే కరెక్ట్ అని నాగార్జున అనుకున్నారు. ఆ దిశగానే తన టీమ్ ను నడిపించారు. అయితే కథాపరంగా .. బడ్జెట్ పరంగా కూడా ఇది పెద్ద సినిమానే. తక్కువ సమయం ఉండటం వలన, సంక్రాంతికి ఈ సినిమా రావడం కష్టమేనని అంతా అనుకున్నారు. కానీ నాగార్జున మాత్రం ఆ దిశగానే అప్ డేట్లు వదులుతూ వచ్చారు.
అనుకున్నట్టుగానే నాగార్జున ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలబెట్టారు. అదృష్టం కొద్దీ పెద్ద సినిమాలు .. అనువాద సినిమాలు కూడా పక్కకి తప్పుకోవడంతో ‘నా దారి రహదారి’ అన్నట్టుగా ‘బంగార్రాజు’ దూసుకుపోతున్నాడు. ఈ నెల 14వ తేదీన విడుదలైన ఈ సినిమా, తొలి రోజునే 17 కోటలకి పైగా వసూళ్లను రాబట్టింది. రెండవ రోజు కూడా అదే జోరును కొనసాగించింది. రెండు రోజుల్లోనే ఈ సినిమా 36 కోట్ల గ్రాస్ ను రాబట్టడం విశేషం. ఈ సినిమా ఇదే ఊపును మరికొన్ని రోజుల పాటు కొనసాగించడం ఖాయమని చెప్పుకుంటున్నారు.
Also Read : సంక్రాంతికి ఫుల్ మీల్స్ ‘బంగార్రాజు’ : అక్కినేని నాగ చైతన్య