Ashes Ends: యాషెస్ సిరీస్ ఐదో టెస్ట్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన ఇంగ్లాండ్ పరుగుల వేటలో విఫలమైంది. మూడు వికెట్లకు 37 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నేటి ఆట మొదలు పెట్టిన ఆసీస్ 155 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆసీస్ బ్యాట్స్ మెన్ లో అలెక్స్ క్యారీ-49; స్టీవెన్ స్మిత్ -27; గ్రీన్-23 మాత్రమే రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్ మార్క్ వుడ్ ఆరు వికేట్లతో సత్తా చాటాడు. బ్రాడ్ మూడు, క్రిస్ ఓక్స్ ఒక వికెట్ సాధించారు.
271 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 124 పరుగులకే చాపచుట్టి మూడోరోజునే మ్యాచ్ చేజార్చుకుంది. ఓపెనర్లు రోరీ బర్న్స్-26; జాక్ క్రాలే-36 మొదటి వికెట్ కు 68పరుగుల భాగస్వామ్యం నమోదు చేసినప్పటికీ ఈ స్పూర్తిని కొనసాగించడంతో మిగిలిన ఆటగాళ్ళు విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లు కెప్టెన్ కమ్మిన్స్, స్కాట్ బొలాండ్, కామెరూన్ గ్రీన్ తలా మూడు; మిచెల్ స్టార్క్ ఒక వికెట్ పడగొట్టారు.
ఈ విజయంతో ఐదుటెస్టుల సిరీస్ లో ఆసీస్ 4-0 ఆధిక్యం సంపాదించింది. నాలుగో టెస్ట్ డ్రా గా ముగిసిన సంగతి తెలిసిందే.
ఈ టెస్టులో సెంచరీ సాధించిన ట్రావిస్ హెడ్ ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ తో పాటు ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ కూడా దక్కించుకున్నాడు.