Jagganna Thota Prabhala Theertham: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాతి పండుగ ఓ ఎత్తైతే.. అందాల సీమ కోనసీమ లో సంక్రాతి సంబరాలు మరో ఎత్తు. సంక్రాంతి అంటే కొత్త ధాన్యం, కొత్త అల్లుళ్ళు, కోడిపందాలు, కొత్త సినిమాలు.. అయితే కనుమ రోజున కోనసీమలో జరుపుకునే ప్రభల తీర్ధం ఎంతో ప్రాశస్త్యం సంతరించుకుంది. కోనసీమ అంటేనే వేదసీమ అని పెద్దల ఉవాచ. అటువంటి వేదసీమలో తరతరాల నుంచి జరుగుతున్న “జగ్గన్నతోట” ప్రభల తీర్థం వైభవాన్ని ఇంతింతా అని చెప్పరానిది. మకర సంక్రమణ ఉత్తరాయణ మహా పుణ్యకాలం లో కనుమనాడు జగ్గన్నతోటలో జరిగే ఏకాదశ రుద్రుల సమాగమము అత్యంత ప్రాచీనమైన, చారిత్రాత్మకమైన, అతిపురాతనమైన, పవిత్రమైన సమాగమము. ప్రాచీన కాలంలో మొట్టమొదటిగా ఈ తోటలోనే ఈ పదకొండు గ్రామాల రుద్రులు సమావేశమయ్యారని ప్రతీతి. ఈ తోటలో ఏ విధమైన గుడి గానీ, గోపురంగానీ వుండవు. ఇది పూర్తిగా కొబ్బరి తోట. ఈ ఏకాదశ రుద్రులు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ సమావేశం అవ్వడంతో ఈ తోట విశేష ప్రాధాన్యత సంతరించుకుంది.
జగ్గన్నతోట ఇది ఏకాదశ రుద్రుల కొలువు. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారము ఏకాదశ రుద్రులు ఒక్కచోట కొలువు తీరేది ప్రపంచం మొత్తం మీదా.. అసలు ఈ భూమండలం మొత్తం మీద ఉన్న ఒకే ఒక్క చోటు ఈ జగ్గన్న తోట అని స్థానికులు చెబుతారు. అంతేకాదు.. ఆలయమే లేని ఈ స్థలానికి ఒక కథ ఉందంటూ స్థలం పురాణం కూడా వివరిస్తారు. కనుమ రోజున లోక కల్యాణార్ధం పదకొండు గ్రామాల శివుళ్ళు సమావేశం అయ్యి లోక విషయాలు చర్చిస్తారని ప్రతీతి. సుమారు 400 సంవత్సరాల క్రితం నుండీ ఈ సంప్రదాయం వుందనీ తీవ్రమైన పరిస్థితులు వచ్చిన 17 వ శతాబ్ధములో ఈ 11 గ్రామాల రుద్రులు ఈ తోటలోనే సమావేశం అయ్యి లోక రక్షణ గావించారనీ ప్రతీతి. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతీ ఏడాది కనుమ రోజున ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఈ 11మంది రుద్రులు ఒక్కచోట చేరుతారని గ్రామస్తులు నమ్మకంగా చెబుతారు. ఈ తోట అప్పట్లో సంస్థానదీశులైన శ్రీ రాజా వత్సవాయి జగన్నాధ మహారాజు కు చెందినదని.. కాలక్రమంలో ఈ తోట జగ్గన్న తోట అనే పేరుతో స్థిరపడింది.
Also Read : సంక్రాంతి సంబరాల్లో బాలయ్య