Its not Fair: సిఎం జగన్ కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అందరి సంక్షేమం కోసం పరిపాలన సాగిస్తుంటే, బిజెపి నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు హయాంలో 40 దేవాలయాలు కూల్చి వేస్తె ఆ పాపంలో మీకు బాధ్యత లేదా అని బిజెపి నేతలను ప్రశ్నించారు. కర్నూల్ లో బిజెపి నేడు నిర్వహించిన ప్రజా నిరసన సభలో సిఎం జగన్ పై చేసిన విమర్శలను వెల్లంపల్లి తీవ్రంగా ఖండించారు. వీర్రాజు ఒరిజినల్ బిజేపినా, డూప్లికేట్ బిజేపినా; దేశ భక్తుడా- టిడిపి భక్తుడా అనేది చెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపి ఇన్ ఛార్జ్ ల పేరుతో ఎక్కడి నుంచో నేతలు ఇక్కడకు వచ్చి ప్రభుత్వంపై ఇష్టారీతిన విమర్శలు చేయడం సరికాదన్నారు.
కర్నూల్ లో బిజెపి నిర్వహించింది నిరసన సభ కాదని….కులాల మధ్య, మతాల మధ్య చిచ్చుపెట్టే దుర్మార్గమైన సభ అని వెల్లంపల్లి మండిపడ్డారు. సిఎం జగన్ పై కులం ముద్ర, మతం ముద్ర వేసేందుకు బిజెపి ఎన్నో ప్రయత్నాలు చేస్తోందని, రాష్ట్రంలో శాంతి భద్రలకు విఘాతం కలిగిస్తోందని విమర్శించారు. ఒకప్పుడు సోము వీర్రాజు అంటే అందరికీ తెలిసేదని, ఇప్పుడు సారాయి వీర్రాజు అంటేనే తెలుస్తుందని చురకలంటించారు.
సోము బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గరి నుంచీ రాష్ట్రంలో అశాంతిని ప్రేరేపించేలా వ్యవహరిస్తున్నారని వెల్లంపల్లి ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ధ్వంసమైన ఆలయాలను తమ ప్రభుత్వ హయాంలో నిర్మిస్తున్నామని, అంతర్వేది ఘటనపై సిబిఐ విచారణ వేయాలని కోరితే ఇప్పటివరకూ ఆతీగతీ లేదని ధ్వజమెత్తారు.
రామతీర్థం కొండపై కనీస వసతులు కూడా లేకపోతే ఆ ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నామని వచ్చే శ్రీరామనవమికి ప్రారంభోత్సవం చేస్తామని వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా హిందూ దేవాలయాలని సిఎం జగన్ అభివృద్ధి చేస్తున్నారని వివరించారు. అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలని వెల్లంపల్లి విజ్ఞప్తి చేశారు.