Unnecessary Accents:
వ్రిప్పుడే వ్రందిన వ్రార్త.
నాగశౌర్య సినిమా పేరు “కృష్ణ వ్రింద విహారి”
వ్రెంత మ్రుద్దొస్తోందో ప్రేరు?
ప్రలుకుతుంటేనే వ్రొళ్లు ప్రులకవ్రిస్తోంది.
ఇది ప్రలకలేక, వ్రాయడం చ్రేత గ్రాని వ్రారు వ్రాసిన ప్రేరు క్రాదు. సినిమా ట్రైటిల్ క్రొత్తగా వ్రుండాలని ప్రెట్టిన ప్రేరు.
ప్రలకడం చ్రేత గ్రాక ప్రోతే అది మ్రీ ఖర్మ.
తెలుగులో కళకళల పెళ్లిళ్లు ఆగిపోయి కలకలల కకావికలల పెల్లిల్లు పలకడం మొదలై దశాబ్దాలు అవుతోంది. కాబట్టి బెంగాలీలు, ఒరియావారు, ఇంకెవరో ఒకక్షరానికి బదులు ఇంకో అక్షరాన్ని పలుకుతున్నా వేల ఏళ్లుగా ఎలాంటి అనర్థం జరగలేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ ను రబింద్రనాథ్ ఠాగూర్ అని సగం దేశం పలుకుతున్నా ఆయన గీతాంజలికి వన్నె తగ్గలేదు. తగ్గబోదు. అలాగే బృందావన్ మాటను సగం దేశం వ్రిందావన్ అని పలుకుతున్నా కృష్ణుడు బృందావనాన్ని వదిలిపోలేదు.
దక్షిణాదిలో రాసిన ప్రతి అక్షరాన్ని దాటేయకుండా, స్పష్టంగా పలకడం అలవాటు. పద్ధతి. అందుకే చాలామంది మాట్లాడేప్పుడు మధ్యాన్నం అన్నా, ఫార్మల్ గా చదివేప్పుడు మాత్రం మధ్యాహ్నం అని ‘హ’ అక్షరానికి అన్యాయం జరక్కుండా పలుకుతారు.
భారతీయ భాషల ఐక్యతకు, అన్ని లిపులు, ఉచ్చారణల ఏకీకరణకు ఈ అందమయిన ‘వ్రింద’ బృంద రాతలు ఎంతగానో ఉపయోగపడతాయి.
“యదా – యదా – హి – ధర్మస్య – గ్లానిః – భవతి – భారత – అభ్యుత్థానం – అధర్మస్య – తదా – ఆత్మానం – సృజామి – అహం-
ధర్మం నశించి, అధర్మం పెచ్చు మీరినప్పుడల్లా నన్ను నేనే సృష్టించుకుంటూ ఉంటాను.”
తను ఎప్పుడెప్పుడు అవతరిస్తాడో గీతలో భగవానుడు స్పష్టంగా చెప్పాడు.
తెలుగు భాషకు, ప్రత్యేకించి తెలుగు లిపికి గోచీ గుడ్డ కూడా మిగలని ఈ సంక్షుభిత వేళ…
ఈ కృష్ణ “వ్రిందుడు” విహరించే అవతారం ఎత్తి ఉంటాడు.
ప్రళ్లేల్లో కర్పూరం వ్రెలిగించి హారతులు ప్రట్టడం త్రప్ప మ్రనం చ్రేయ గ్రలిగింది వ్రేమీ వ్రుండదు.
కొస పిలుపు:-
ఈ సినిమా పేరులో వి కి రావత్తు క్రావడి ఇచ్చి “వ్రింద” అని యావత్తు తెలుగు లిపి సొత్తుకు క్రొత్త ఒత్తు విత్తు విత్తిన మెదడుకు ఈ ఏటి జ్ఞాన పీఠం ఇవ్వాలని డిమాండు చేయకపోతే మనల్ను మనమే అవమానించుకున్నట్లు.
బాబ్బాబూ!
అదే చేత్తో చివర విహారిని మార్చి…
“వ్రిహారి” అని ప్రెట్టి ప్రుణ్యం క్రట్టుకో న్రాయనా!
బృందావన లిపిని కాపాడ్డానికి బృందావనం వదిలి…
కృష్ణా నీ బేగనే బారో!
-పమిడికాల్వ మధుసూదన్
ALSO Read : సంక్షోభంలో సంపద పాఠం