స్కూలు విద్యార్థులకు అతి త్వరలో వ్యాక్సిన్ ప్రారంభిస్తామని సింగపూర్ ప్రధానమంత్రి లీ షేన్ లూంగ్ ప్రకటించారు. కోవిడ్ కొత్త వేరియంట్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్న వైద్య నిపుణుల హెచ్చరికల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కరోనాను సమర్ధంగా కట్టడి చేస్తూ వచ్చిన సింగపూర్ లో మే రెండవ వారంలో పాజిటివ్ కేసులు మళ్ళీ మొదలయ్యాయి. కొంతమంది చిన్నారులు కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు… అప్రమత్తమైన సింగపూర్ ప్రభుత్వం వెంటనే కోవిడ్ ఆంక్షలు విధించింది, స్కూళ్ళను మూసివేసింది.
గతంలో 16 ఏళ్ళు పైబడిన వారికి మాత్రమే ఇవ్వాలని నిర్దేశించిన ఫైజర్, బయో ఎన్-టెక్ వ్యాక్సిన్ లు 12 నుంచి 15 ఏళ్ళ విద్యార్ధులకు కూడా అందించాలని అధికారులు నిర్ణయించారు. పెద్దవారికి వ్యాక్సిన్ పూర్తికాక ముందే పిల్లలకు మొదలుపెట్టిన తొలి దేశంగా సింగపూర్ నిలుస్తోంది.
అధికారులతో సమీక్ష అనంతరం లీ షేన్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తాజా దశలో విద్యార్ధులు కోవిడ్ బారిన పడుతున్నారని, వారిలో తీవ్రమైన లక్షణాలు లేకపోయినా… తల్లిదండ్రుల ఆవేదనను అర్ధం చేసుకొని వారికి కూడా వ్యాక్సిన్ ఇస్తున్నామని తెలిపారు. ప్రస్తుత సెలవుల్లోనే వారికి వ్యాక్సిన్ పూర్తి చేస్తామని వెల్లడించారు. కోవిడ్ అదుపులోనే ఉందని, ప్రస్తుతం అమల్లో ఉన్న ఆంక్షలు జూన్ 13 నుంచి సడలిస్తామని లీ షేన్ ప్రకటించారు.
సింగపూర్ లో మొత్తం 4 లక్షల మంది విద్యార్ధులకు వ్యాక్సిన్ అందించనున్నారు. మంగళవారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించి గురువారం నుంచి డోసులు ఇవ్వడం ప్రారంభిస్తారు. స్కూలు విద్యార్ధుల అనంతరం 39 ఏళ్ళ లోబడిన యువకులకు వ్యాక్సిన్ అందిస్తారు.
ప్రపంచంలో కోవిడ్ తీవ్రత తక్కువగా ఉన్న దేశాల్లో సింగపూర్ కూడా ఉంది. గత ఏడాది కోవిడ్ మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా 62 వేల కేసులు నమోదుకాగా, ౩౩ మంది ఈ మహమ్మారికి బలయ్యారు.