Try to understand: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని ఉద్యోగులు ఆర్ధం చేసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సంక్షేమం గురించి ఆలోచన చేశారు కాబట్టే సిఎం జగన్ అధికారంలోకి రాగానే వెంటనే 27 శాతం ఐఆర్ ఇచ్చారని, 18 వేల కోట్ల రూపాయల భారం పడినా వెనకడుగు వేయలేదని చెప్పారు. ప్రభుత్వం, ఉద్యోగులు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కడపలో జిల్లా పరిషత్ ఛైర్మన్ అమరనాథ్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.
కొత్త పీఆర్సీతో ప్రభుత్వంపై ఏటా 10 వేల కోట్ల రూపాయల భారం పడుతుందన్నారు. ప్రభుత్వం ఎన్ని కష్టాల్లో ఉన్నా ఉద్యోగుల కోసం ఆలోచిస్తోందని, అయినా సరే వారు సమ్మె కు వెళ్ళడం భావ్యం కాదన్నారు. ఉద్యోగులు చర్చలకు రాకుండా కొందరు కుట్రలు చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. యూనియన్ నాయకులను ప్రభావితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని చూస్తున్నారని విమర్శించారు. ఏడాదిలో లక్షా 30 వేల ఉద్యోగాలు ఇచ్చిన నాయకుడు సిఎం జగన్ అని, ఉద్యోగ సంఘాల నేతలు విపక్షాల ట్రాప్ లో పడొద్దని, కొందరు ఉద్యోగులు సిఎం పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆయన్ను అగౌరవ పరిచేలా మాట్లడడం సమంజసం కాదని సూచించారు.
చంద్రబాబు తన స్వార్ధం కోసం ఎవరినైనా బలిచేస్తారన్నారు. గతంలో రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా కడప, పులివెందులకు ముడిపెట్టి మాట్లాడేవారని…. ఇప్పుడు క్యాసినో, జూదం అంటూ మాట్లాడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఈ ప్రభుత్వం జూదాన్ని ఎన్నడూ ప్రోత్సహించలేదని, పేకాట క్లబ్బులు మూసివేయిన్చారని, కానీ హైదరాబాద్ లో నైట్ లైఫ్ తానే ప్రవేశాపెట్టినట్లు బాబు స్వయంగా చెప్పుకున్నారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో… ముఖ్యంగా కోస్తాజిల్లాల్లో సంక్రాంతికి కోడి పందేలు ఆడుకోవడం ఆనవాయితీగా వస్తోందని, ఒకవేళ సిఎం జగన్ వాటిని గట్టిగా అడ్డుకొని ఉంటే ఈ ప్రభుత్వం సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడంలేదని బాబు విమర్శించి ఉండేవారని శ్రీకాంత్ ఎద్దేవా చేశారు.
Also Read : చర్చలకు రాలేము: ఉద్యోగ సంఘాలు