“మనిషై పుట్టిన వాడు కారాదు మట్టిబొమ్మ
పట్టుదలే వుంటే కాగలడు మరో బ్రహ్మ
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషులవుతారు
తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలవేలుపులవుతారు”
అంటూ సీనీగేయ రచయిత వేటూరి చక్కగా వర్ణించారు. పట్టుదల వుంటే సాధించలేనిది ఏదీలేదన్నారు పెద్దలు. రీల్ హీరో కావాలన్నా, రియల్ హిరోకావాలన్నా కృషి ఉండాలి. అయితే రీల్ విలన్ నుంచి రియల్ హీరోగా ఎదిగిన సోనూసూద్ ఇప్పుడు అందరికీ ఆదర్శం. ఇప్పుడేమిటి కొత్తగా ఈ రియల్ హీరో గుర్తొచ్చాడు, కరోనా మహమ్మారి విజృంభణ దగ్గరినుంచి ఏడాదిన్నరగా నిరంతరం ప్రజాసేవలో సోనూ ఉన్నాడుకదా అంటారా…. బాలీవుడ్ ప్రముఖ మ్యాగజైన్ స్టార్ డస్ట్ తన ఏప్రిల్ సంచిక కవర్ పేజీలో రియల్ హీరోగా సోనూసూద్ ఫొటోను ప్రముఖంగా ప్రచురించింది. అందుకు ధన్యవాదాలు తెలిపిన మన రియల్ హీరో, గత అనుభవాన్ని కూడా ట్వీట్ లో పంచుకోవడం ఇప్పుడు విశేషంగా మారింది. అవమానం జరిగినచోటే ఇప్పుడు గౌరవం దక్కడం ఆనందంగా ఉందని పేర్కొంటూ గతంలో స్టార్ డస్ట్ ఆడిషన్స్ కోసం పంజాబ్ నుంచి తన ఫొటోలను పంపితే తిరస్కరించిన సంగతిని గుర్తు చేశాడు.
ఒకప్పుడు స్టార్ డస్ట్ గుర్తింపు కోసం నటుడిగా ఎదగడానికి సోనూసూద్ ప్రయత్నిస్తే, ఇప్పుడు ఆ ప్రముఖ మ్యాగజైనే తన కవర్ పేజీకి కళ తెచ్చుకునేందుకు సోనూసూద్ ఫొటోను ప్రచురించుకుంది. గతంలో ఆ మొహాన్నే తిరస్కరించి, ఫొటోను డస్ట్ బిన్ పాలుచేసామన్న విషయం సదరు మ్యాగజైన్ వారికి గుర్తుందో లేదోగాని, ఈ ఆణిముత్యం ఫొటోను డస్ట్ బిన్ నుంచి వెదికిపట్టుకుని కలర్ జోడించి మరీ కవర్ పేజీగా మెరిపించాల్సి వచ్చింది.
1971 నుంచి ప్రచురితమవుతున్న స్టార్ డస్ట్ మ్యాగజైన్ స్టార్ డమ్ కేటగిరీలో సినీహిరోలకు ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. సోనూసూద్ కు రియల్ హీరో కేటగిరీలో మ్యాగజైన్ కవర్ పేజీలో స్ధానం దక్కడం ముదావహం. ఏదైనా కరోనా కష్టకాలంలో వేలాదిమందికి సాయమందిస్తూ సోనూసూద్ రియల్ హీరో గా మారాడు. ఎక్కడి నుంచి ఎవరు సాయం కోరినా నేనున్నానంటూ మొదటివరుసలో నిలుస్తున్నాడు. అందుకే ఏకష్టమొచ్చినా సోనూసూద్ గుర్తుకొస్తున్నాడు. ఇందుకు మన తెలుగు రాష్ర్టాలు మినహాయింపు కాదు. అందుకే మనమూ ఆయనకు అండగా నిలుద్దాం… కష్టేఫలి అని నిరూపిద్దాం. హ్యాట్సాఫ్ టు రియల్ హీరో.
-వెలది కృష్ణకుమార్