Afghan Educational Institutions Open From February 2nd :
సుదీర్ఘ విరామం తర్వాత ఆఫ్ఘానిస్తాన్ లో విశ్వవిద్యాలయాలు ప్రారంభం అవుతున్నాయి. ఎల్లుండి(ఫిబ్రవరి-2) నుంచి అన్ని విశ్వవిద్యాలయాలు పనిచేస్తాయని తాలిబాన్ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ ప్రతినిధి కాబుల్ లో ప్రకటించారు. గత ఆరు నెలల నుంచి విశ్వవిద్యాలయాలు మూసివేశారు. కొత్త విద్యాసంవత్సరం నుంచి సజావుగా పనిచేస్తాయని తాలిబాన్ ప్రతినిధి వెల్లడించారు. గతంలో మార్చి నుంచి విద్యాసంస్థలు ప్రారంభం అవుతాయని ప్రకటించిన తాలిబాన్ నెల రోజుల ముందుగానే ప్రారంభించటంపై ఆఫ్ఘన్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాలిబన్లు అధికారంలోకి వచ్చాక కొన్ని రోజులు యూనివర్సిటీలు నడిచినా ఆ తర్వాత మూసివేశారు. ఉత్తర ప్రాంతాల్లో తీవ్రమైన చలి, వనరుల కొరత, సిబ్బంది కొరత, అనేక విశ్వవిద్యాలయాల్లో పనిచేసే ఆచార్యులు తాలిబన్లు పాలన పగ్గాలు చేపట్టడంతో దేశం విడిచి వెళ్ళిపోగా మరికొందరు ఉద్యోగాలు మానుకున్నారు. దీంతో అనేక ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు ముతపడ్డాయి.
అయితే బాలికల విద్యపై తాలిబన్లు స్పష్టత ఇవ్వలేదు. కేవలం ఆరో తరగతి వరకే బాలికలను స్కూల్స్ కు అనుమతిస్తున్నారు. పై తరగతులకు బాలికలను ఎప్పటి నుంచి అనుమతించేది స్పష్టత ఇవ్వలేదు. విద్యార్థినులను ఉన్నత విద్యకు అనుమతించటం, పని ప్రదేశాల్లో మహిళలకు సమాన అవకాశాలు తదితర మహిళా హక్కులు, మైనారిటీల రక్షణ అమలులోకి వచ్చినపుడే తాలిబన్లను అంతర్జాతీయ సమాజం గుర్తించేందుకు అవకాశం ఉంది.