Brahmanandam- Happiness: తెలుగు తెరపై ఎంతోమంది హాస్యనటులు తమదైన ముద్ర వేశారు. కస్తూరి శివరావు .. రేలంగి .. రమణారెడ్డి .. రాజబాబు .. పద్మనాభం .. అల్లు రామలింగయ్య తమదైన ప్రత్యేక శైలిలో నవ్వులు పూయించారు .. నవ్వులు పారించారు. ఆ తరువాత హాస్యాన్ని ఉరకలు వేయించే వంతు నాది .. పరుగులు తీయించే బాధ్యత నాది అంటూ తెలుగు తెరపైకి బ్రహ్మానందం వచ్చారు. గుంటూరు జిల్లా .. సత్తెనపల్లి తాలూకా .. ‘ముప్పాళ్ల’ గ్రామంలో బ్రహ్మానందం జన్మించారు. భీమవరం .. గుంటూరు ప్రాంతాల్లో ఆయన విద్యాభ్యాసం నడిచింది. ‘అత్తిలి’లో ఆయన లెక్చరర్ గా పనిచేసేవారు.
మొదటి నుంచి కూడా బ్రహ్మానందం చాలా యాక్టివ్ గా ఉండేవారట. ఇతరుల బాడీ లాంగ్వేజ్ ను .. మాట తీరును అనుకరిస్తూ అందరినీ నవ్విస్తూ ఉండేవారు. ఇక సమయస్ఫూర్తితో మాట్లాడటం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. సాంస్కృతిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటూ ఉండేవారు. ఆ సమయంలోనే ఆయన దృష్టి సినిమాలపైకి మళ్లింది. తొలిసారిగా వేజెళ్ల సత్యనారాయణ దర్శకత్వంలో ‘శ్రీ తాతావతారం’ సినిమాతో ఆయన కెమెరా ముందుకు వచ్చారు. అయితే జంధ్యాల గారి దర్శకత్వంలో చేసిన ‘అహ నా పెళ్లంట’ సినిమా ముందుగా విడుదలైంది.
‘అహ నా పెళ్లంట’లోని అరగుండు పాత్ర బ్రహ్మానందానికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా తరువాత ఇక అవకాశాల పరంగా ఆయన వెనుదిరిగి చూకోవలసిన అవసరం లేకుండా పోయింది. జంధ్యాల దర్శకుడిగా బిజీగా ఉండటం .. ఆయన వరుసగా హాస్యభరితమైన సినిమాలు చేయడం .. ప్రతి సినిమాలోను బ్రహ్మానందానికి ఒక పాత్ర ఉండటం ఆయన కెరియర్ కి బాగా హెల్ప్ అయింది. తనలో హాస్య నటుడు ఏ స్థాయిలో ఉన్నాడని గుర్తించి అవకాశాన్నిచ్చి ప్రోత్సహించిన జంధ్యాలగారు తనకి గురువని బ్రహ్మానందం చాలా వేదికలపై చెప్పారు.
జంధ్యాల గారి తరువాత బ్రహ్మానందం స్పీడ్ తగ్గలేదు .. అందుకు కారకులు ఈవీవీ సత్యనారాయణ. తన సినిమాల్లో ఆయన బ్రహ్మానందానికి ఇచ్చిన పాత్రలు మరింత పేరు తెచ్చిపెట్టాయి. హీరోతో సమానంగా ఆయన పాత్రలను చివరి వరకూ నడిపించిన దర్శకుడు ఈవీవీ అనే చెప్పాలి. అలా వరుస సినిమాలతో బ్రహ్మానందం బిజీ అయ్యారు. ఈ లోగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘మనీ’ .. ‘అనగనగా ఒక రోజు’ వంటి సినిమాలు కూడా బ్రహ్మానందం రేంజ్ ను అమాంతంగా పెంచేశాయి. ఈ సినిమాల్లో కొత్తగా కనిపిస్తూ కామెడీ పరంగా ఆయన విశ్వరూప విన్యాసం చేశారు.
ఒకానొక దశ వచ్చేసరికి బ్రహ్మానందం లేని సినిమా లేకుండా పోయింది. ఆయన డేట్స్ కోసం స్టార్ హీరోలు సైతం వెయిట్ చేయవలసి వచ్చింది. బ్రహ్మానందాన్ని దృష్టిలో పెట్టుకుని రచయితలు పాత్రలను క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. కచ్చితంగా ఆయనకి ఒక ఊతపదం ఉండవలసిందే. ఆయన చెప్పే ఊతపదాలు విపరీతంగా పాప్యులర్ అయ్యేవి. ‘నీ యంకమ్మా’ .. ‘ ఖాన్ తో గేమ్స్ ఆడకు శాల్తీలు లేచిపోతయ్’ .. ‘పండగ చేస్కో’ .. ‘మరీ అంత ఎదవలా కనపడుతున్నానా’ వంటి డైలాగ్స్ ఇప్పటికీ చాలామంది నోళ్లలో నానుతున్నాయి.
వర్మ .. పూరి సినిమాలతో బ్రహ్మానందం తన కెరియర్ ను నవ్వుల పడవలో నడిపిస్తున్న సమయంలోనే శ్రీను వైట్ల ఆయనకి తగిలారు. ఇక జంధ్యాల .. ఈవీవీ మాదిరిగానే తాను ఏ సినిమా చేసినా అందులో బ్రహ్మానందం ఉండాల్సిందే అన్నట్టుగా ఆయన కోసం ప్రత్యేకమైన పాత్రలను శ్రీను వైట్ల డిజైన్ చేయిస్తూ వెళ్లాడు. అలా వాళ్ల కాంబినేషన్లో వచ్చిన ‘వెంకీ’ .. ‘ఢీ’ .. ‘రెడీ’ .. ‘నమో వెంకటేశ’ .. ‘దూకుడు’ సినిమాలలో బ్రహ్మానందం సిన నవ్వుల సందడి అంతా ఇంతాకాదు. ఆ పాత్రల పేర్లను కూడా ప్రేక్షకులు ఇంతవరకూ మరిచిపోలేదు.
ఇక మరో వైపున త్రివిక్రమ్ క్రియేట్ చేసిన పాత్రలు కూడా బ్రహ్మానందం దూకుడును మరింత పెంచాయి. వినాయక్ దర్శకత్వంలో చేసిన ‘అదుర్స్’ వంటి సినిమాలు కూడా ఆయనలోని హాస్యనటనకు కొలమానంగా నిలుస్తాయి. తెలుగులో అల్లు రామలింగయ్య తరువాత చిత్రగుప్తుడు’ పాత్రను అంత అద్భుతంగా పోషించిన హాస్యనటుడు బ్రహ్మానందమేనని చెప్పాలి. అందుకు నిదర్శనంగా ‘యమలీల’ .. ‘యమదొంగ’ కనిపిస్తాయి. ఈ పాత్రలో ఆయన చేసిన అల్లరిని అంత తేలికగా మరచిపోలేము.
తొలినాళ్లలో శ్రీలక్ష్మితో కలిసి నవ్వులు పండించిన బ్రహ్మానందం, ఆ తరువాత కోవై సరళతో కలిసి కితకితలు పెట్టేశారు. ఒక వైపున సీనియర్ స్టార్ హీరోలతో కలిసి ఎంత సందడి చేశారో. ఏ మాత్రం ఏజ్ గ్యాప్ ఆలోచన రానీయకుండా యంగ్ హీరోలతో కలిసి అంతే అల్లరి చేయడం బ్రహ్మానందం ప్రత్యేకత. తెలుగు తెరపై ఏ హాస్యనటుడు చేయనన్ని విభిన్నమైన పాత్రలను చేయడం బ్రహ్మానందం వల్లనే అయింది. అలాగే ఎమోషన్ తో ముడిపడిన ‘బాబాయ్ హోటల్’ వంటి సినిమా చేయడం కూడా ఆయనకే సాధ్యమైంది. చాలా తక్కువ సమయంలో అత్యధిక సినిమాలను చేసిన హాస్యనటుగా ఆయన గిన్నీస్ బుక్ లోకి ఎక్కారు. తన ప్రతిభకి తగిన గౌరవంగా పద్మశ్రీని అందుకున్నారు.
బ్రహ్మానందం హాస్యాన్ని గురించి ఒక పూటలోనో .. ఒక రోజులోనో చెప్పుకోలేం. ఆయన ప్రతి పాత్ర ఒక నవ్వుల మాత్ర .. ప్రతి సినిమా ఒక నవ్వుల పాత్ర. ఆయన పోషించిన ఒక్కో పాత్రపై ఒక పుస్తకమే రాయవచ్చు. హాస్యానికి ఆయనను పెద్ద బాలశిక్షగా భావించవచ్చు. దశాబ్దాలుగా ప్రయాణం కొనసాగుతున్నప్పటికీ ఆయన హాస్యం పట్టుసడలడం లేదు .. పలచబడటం లేదు. ఇప్పటికీ అందరికీ బ్రహ్మానందమే కావాలి. తెరపై ఆయన కనిపిస్తే చాలు .. ఆయన ఎక్స్ ప్రెషన్ ఒకటైనా చాలు అనుకునేవాళ్లు ఎంతోమంది. అలాంటి బ్రహ్మానందం పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం!
(బ్రహ్మానందం జన్మదిన ప్రత్యేకం)
— పెద్దింటి గోపీకృష్ణ
Also Read : కలగానే మిగిలిన కలలరాణి సినీ ప్రయాణం