14 Caste Communities : బిసి ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కల సాకారం కాబోతుంది, వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం నిలిపేలా రాజదాని నడిబొడ్డున అద్బుత నిర్మాణాలు రూపుదాల్చబోతున్నాయి, ఇందుకోసం బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కృషితో మంగళవారం ఏక సంఘంగా ఏర్పడిన 1.దేవాంగ 2. పట్కారీ 3.పూసల 4.లక్కీమారి కాపు 5.రంగ్రీజ్ /భవసారా 6.అగర్వాల్ సమాజ్ 7.నీలి 8.జాన్ద్ర 9.మేర 10.చాత్తాద శ్రీవైష్ణవ 11.ఎల్లాపు 12.మేదరి 13.బసవేశ్వర భవన్ (లింగాయత్ )14.భట్రాజు కుల వంటి పద్నాలుగు ఏక కుల సంఘాలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం, హైదరాబాద్లో బిసి ఆత్మగౌరవ భవనాల అనుమతి పత్రాలను మంజూరు చేసారు. ఈ నెల 15వ తారీఖు వరకూ ఏక సంఘంగా రిజిస్టరైన ప్రతీ కులానికి ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించుకోవడానికి వారికే అనుమతి ఇస్తామని, అప్పటికీ ఏకసంఘంగా రాని వాటికి ప్రభుత్వమే నిర్ణయం తీసుకొని భవనాల్ని నిర్మిస్తుందని మంత్రి గంగుల తెలియజేసారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలాకరు కల్లా అన్ని ఆత్మగౌరవ భవనాల నిర్మాణం ప్రారంభమవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి గంగుల కమలాకర్ స్వాతంత్రం వచ్చిన డెబ్బైఐదేళ్లలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి కూడా బిసిల కోసం ఆలోచించలేదని, కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందన్నారు బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఉన్నత వర్గాలకు దీటుగా బీసీలను తీసుకెళ్లాలని, వేల కోట్లు కేటాయించడంతో పాటు వారికి కావాల్సిన ఆత్మగౌరవాన్ని అన్నిరకాలుగా అందివ్వాలని సీఎం కేసీఆర్ నిరంతరం తపన పడుతారన్నారు. బీసీ గురుకులాలు, హాస్టళ్లు ఇతరత్రా సదుపాయాలతో పాటు వేల కోట్ల విలువ చేసే 82 ఎకరాల్ని హైదరాబాద్లో 41 బిసి కులాలకు కేటాయించామన్నారు, ఈ భవనాల్ని నిర్మించుకోవడానికి సైతం ఆయా కుల సంఘాల ట్రస్టుకు అధికారాలు ఇవ్వాలని, విలువైన భూమితో పాటు ఎకరాకు కోటి రూపాయల్ని సైతం కేటాయించారన్నారు. అందుకోసం ఈనెల 2 వ తారీఖు నుండి 15వ తారీఖు వరకూ ఏక సంఘంగా ఏర్పడిన ప్రతీ బిసి కులాలకు భవనాల అనుమతి పత్రాలు మంజూరు చేస్తామన్నారు. ఏకం కాని సంఘాలకు మార్చి నెలాఖరులోగా ప్రభుత్వమే భవన నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
మరో మంత్రి తలసాని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతం వరకూ బీసీల కోసం పాటుపడుతుంది తెలంగాణ ప్రభుత్వమని, డెబ్బైఐదేళ్లలో ఏ ప్రభుత్వం కూడా చేయని క్రుషిని సీఎం కేసీఆర్ గారు చేస్తున్నారన్నారు మంత్రి శ్రీనివాస్ యాదవ్, హెచ్ ఎండీఏ వేలంలో వేలకోట్ల విలువ చేసే స్థలాల్ని బీసీలకు కేటాయించిన ఘనత కేసీఆర్ దన్నారు. దేశంలో యాబైశాతానికి మించి ఉన్న బిసిలు అణగదొక్కబడ్డారన్నారు, దీనికి కారణం ఐక్యత లొపించడమేనని, ఇకనైనా ఐక్యంగా ఉండి హక్కుల్ని సాధించుకోవాలన్నారు.
అనంతరం మాట్లాడిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ బిసిలంతా బందువులమేనని, అదే ఐక్యత ప్రదర్శించుకొని అతి త్వరలోనే ఆత్మగౌరవ భవనాలను నిర్మించుకొని తదుపరి సమావేశాలు అందులో నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఇవాల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బిసిలకు ఇచ్చిన స్థలాలకు లక్షరూపాయలకు పైగా ఉందని, ఒక్కో కులానికి కోట్లలో విలువగల ఖరీదైన ప్రాంతాల్ని కేటాయించినందుకు మనమందరం సీఎంకు ధన్యవాదాలు తెలుపాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బుర్రావెంకటేశం పలు సూచనలు చేసారు, ఆత్మగౌరవ భవనాల నిర్మాణంలో ఆయా సంఘాలకు పూర్తి స్వేచ్చ ఉందని, ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఆయా కులసంఘాలు తమ ఆత్మగౌరవం ప్రతిఫలించేలా నిర్మాణాలు చేసుకోవచ్చన్నారు, వీటిపై ప్రభుత్వ పర్యవేక్షణ నిరంతరం ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, బీసీ సంక్షేమ శాఖ అధికారులు , 14 బీసీ సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
Also Read : కేసియార్ సిఎం కావడం బిసిల అదృష్టం : గంగుల