Student Leaders in Politics:
’బలవంతుడ, నాకేమని
పలువురితో నిగ్రహించి పలుకుట మేలా?
బలవంతమైన సర్పము
చలి చీమల చేత చిక్కి చావదె సుమతీ’ …అదే జరిగింది చిలీ నియంత ఆగస్టా పినోచెట్ విషయంలో.
దుర్మార్గాలు, నియంత పాలన ఎల్లకాలం నిలబడవు. ముఖ్యంగా దేశపు యువత ఉద్యమాల్లో భాగస్వాములై నియంతల తలవంచడం ప్రజాస్వామ్యంలో సాధ్యమే అని నిరూపించారు చిలీ వాసులు. అక్కడ ఇటీవల జరిగిన ఎన్నికల్లో విద్యార్ధి నాయకుడు గాబ్రియేల్ బోరిక్ సారధ్యంలోని సంకీర్ణ కూటమికి ప్రజలు పట్టం కట్టి మార్పు కోరుకున్నారు. అంతే కాదు, అధికశాతం మహిళా మంత్రులతో ‘లేచింది మహిళా లోకం…దద్దరిల్లింది పురుష ప్రపంచం’ అని పాటలు పాడుకుంటున్నారు. మరి మనం?
మహిళలంటే మనకి గొప్ప గౌరవం. అందుకే వారికే కష్టం తెలీకుండా వంటింటికే పరిమితం చేస్తాం. ఇదీ మన భారత దేశంలో రాజకీయనేతల ధోరణి. అనేక ఇబ్బందులను తట్టుకుని రకరకాల రంగాల్లో మహిళలు ఎదుగుతున్నారు సరే, కానీ అదంతా స్వయంకృషి. ఎంత కృషిచేసినా అస్సలు పైకి రాలేని రంగం ఏమిటీ అంటే రాజకీయాలే. అరవయ్యేళ్ళ స్వతంత్ర భారతంలో అధికారంలో మహిళల పాత్ర పరిశీలిస్తే మిగిలేది విచారమే. మహిళల పేరు చెప్పి ఓట్లు దండుకునే వారే అందరూ. ఈ నాటికీ రిజర్వేషన్లపై ఆధారపడితేనే ఆడవారికి చదువు, రాజకీయాల్లో ప్రవేశం దొరుకుతోంది. అయినా ఎక్కడికక్కడ మానసికంగా, శారీరకంగా వేధించే దుశ్శాసనులకు లోటు లేదు. మంత్రివర్గాల్లో మహిళల సంఖ్య నామ మాత్రం. విద్యార్ధి ఉద్యమాలనుంచి మంత్రులుగా ఎదిగిన వారు లేరనే చెప్పాలి. మహిళా చైతన్యానికి మారుపేరనే తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గంలో మహిళలకు స్థానం కల్పించడానికి ఏళ్ళు పట్టింది. మన దేశంలో స్వేచ్ఛగా పనిచేస్తూ చరిత్ర సృష్టించిన మహిళా మంత్రి ఒక్కరన్నా ఉన్నారా?
ఈ విషయంలో చిన్న దేశం చిలీని చూసి నేర్చుకోవలసింది చాలా ఉంది. అక్కడ త్వరలో కొలువుతీరనున్న ప్రభుత్వంలో మెజారిటీ మంత్రులు మహిళలే. మొత్తం 24 మంది కాబినెట్ మంత్రుల్లో 14 మంది మహిళలే. దాదాపు అందరిదీ ఉద్యమ నేపధ్యమే. పైగా వారి అర్హతలకు తగిన విభాగాలు కేటాయించడం విశేషం.
యాభై ఏళ్ళ మాయా ఫెర్నాండెజ్ తాత, ఒకప్పటి చిలీ అధ్యక్షుడు సాల్వడార్ 1973 లో జరిగిన కుట్ర ద్వారా పదవి కోల్పోయారు. త్వరలో రక్షణ మంత్రిగా పదవి చేపట్టనున్న మాయ గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దే అనేక సంస్కరణలను పర్యవేక్షిస్తారు
మార్సిలా రియోస్ (55)ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఈమె చిలీ దేశానికి కాబోయే న్యాయ శాఖమంత్రి.
అలెగ్జాండ్రా బెనాడో చిలీ దేశపు క్రీడామంత్రిగా ప్రమాణం చేయనుంది.వయసు 45. గతంలో ఫుట్ బాల్ ప్లేయర్. ఉద్యమ కార్యకర్త. గత నియంత ప్రభుత్వం ఈమె తల్లిని చంపించింది.
ఇంకా అనేక విద్యార్ధి ఉద్యమాలకు నాయకత్వం వహించిన జార్జియా జాక్సన్, 32 ఏళ్ళ ఆంటోనియా ఒరేల్మా, డాక్టర్ ఇజకియా (35) వంటి చక్కటి అనుభవమున్న వారు చిలీ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజాహిత కొత్త రాజ్యాంగం ద్వారా వీరందరినీ నడిపించడానికి అధ్యక్షుడిగా బోరిక్ యువ సారధ్యం తోడవుతుంది. ఇలాంటి వీరులు ప్రతి దేశానికీ అవసరమే!
-కె. శోభ
Also Read : లండన్ ప్రిస్టేజ్ ఈజ్ ఫాలింగ్ డౌన్!