Its Govt. Responsibility: ఉద్యోగులు నిన్న విజయవాడలో చేపట్టిన నిరసన చారిత్రాత్మకమని, దేశంలో ఇంత పెద్దఎత్తున ఆందోళనలు చేసిన ఘటనలు గతంలో లేవని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో మాజీ నేత పరుచూరి అశోక్ బాబు అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఈ స్థాయిలో ఉద్యమానికి సిధమవుతున్నా ప్రభుత్వం వారి డిమాండ్ల విషయంలో స్పందించకపోవడం సబబు కాదన్నారు. నిన్న సాయంత్రం మీడియా సమావేశంలో సిఎస్ సమీర్ శర్మ, ఆర్ధిక శాఖా కార్యదర్శి రావత్ లు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఎరియర్స్, నెగెటివ్ ఎరియర్స్ అంశాల్లో సిఎస్ వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. ఉద్యోగులు చర్చలకు వెళ్ళినా, వెళ్లకపోయినా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చైర్మన్ గా ఉద్యోగులను చర్చలకు పిలవాల్సిన బాధ్యత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఉంటుందని అశోక్ బాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగుల ఆందోళనపై గవర్నర్ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగులతో చర్చలపై సజ్జల రామకృష్ణా రెడ్డి ముగిసిన అధ్యాయం అంటూ మాట్లాడడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం సరికాదన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగులను చర్చలకు పిలవాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. సమ్మె అనివార్యంగానే కనబడుతోందని, సమ్మె కాలంలో జీతాలు రావని, అయినా సరే ఉద్యోగులు అన్నిటికీ సిద్ధపడే సమ్మెకు వెళుతున్నారని, తాము కూడా గతంలో సమైఖ్యాంధ్ర ఉద్యమ సమయంలో 84 రోజులపాటు సమ్మె చేశామని గుర్తు చేశారు. ఉద్యోగుల సమ్మెకు ప్రభుత్వంలోని అన్ని శాఖలూ మద్దతు ఇస్తున్నాయని, ఆర్టీసీ కార్మికులు, మున్సిపల్ ఉద్యోగులు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా పాల్గొంటామని చెబుతున్నారని, సమ్మెవల్ల ప్రజలకు తీవ్రమైన ఇబ్బంది ఉంటుందని చెప్పారు.
Also Read : ఉద్యోగులపై ఎందుకంత కక్ష? లోకేష్