కరోన మహమ్మారి కట్టడికి స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సింగల్ డోస్ ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. సింగల్ డోస్ విజయవంతం కాగానే భారత దేశానికి తీసుకు వచ్చేందుకు రెడ్డి లాబ్స్ వర్గాలు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. స్పుత్నిక్ వి లైట్ వస్తే ఇండియాలో మొదటి సింగల్ డోస్ వ్యాక్సిన్ అవుతుంది.
స్పుత్నిక్ వి లైట్ అన్ని అనుమతులు పొంది ప్రస్తుతం క్లినికల్ ట్రయల్ దశలో ఉంది. రెండో డోసు తీసుకోని వారిపై రష్యా లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజుల తర్వాత 79.4 శాతం పని చేస్తూ కరోనాను నియంత్రిస్తోందని సమాచారం.
మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఏడు వేల మందికి ఈ వ్యాక్సిన్ ఇచ్చి పరీక్షలు చేస్తున్నారు. రష్యా తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరట్స్ ( యు.ఏ.ఈ), ఘనా దేశాల్లో ఈ పరీక్షలు చేస్తున్నారు. స్పుత్నిక్ వి లైట్ సింగల్ డోస్ భారత దేశానికి ఎంతో ఉపయోగకరమని, దేశ జనాభాకు అనుగుణంగా వ్యాక్సిన్ లక్ష్యం కూడా చేరుకోవచ్చని వైద్య వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి.