Her songs forever: కొన్ని దశాబ్దాలపాటు నిదురపోరా తమ్ముడా అని లాలించిన ఆ గళం నిదురపోయింది.
వైష్ణవ జనతో అంటూ జనంతో మమేకమైన మధుర స్వరం మూగపోయింది.
ఏ మేరె వతన్ కి లోగోం .. అంటూ సైనిక సోదరుల త్యాగాలను స్మరించిన కంఠం విశ్రాంతి కోరుకుంది.
బాలనటిగా, గాయనిగా కెరీర్ ప్రారంభించి హిందీ సినీ సంగీతంలో ఎదురులేని గాయనిగా ఎదిగిన లతా మంగేష్కర్ ఉరఫ్ లతా దీదీ ధన్యజీవి.
ఆప్ కీ నజరోమ్ నే సంజా ప్యార్ కే కాబిల్ ముఝే అన్నా
ఏక్ తూ నా మిలా , సారీ దునియా మిలే భీ తో క్యా హై అంటూ తీగలా సాగిపోయినా ఆ తేనెలూరే గాత్రానికే సాధ్యం. ఒకటా రెండా సుమారు ఎనభై ఏళ్ళు గాయనిగా ప్రస్థానం అంటే మామూలు విషయం కాదు. పెద్దకుటుంబంలో పెద్దకూతురిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ దేశానికే దీదీ గా ఎదిగారు. ఎన్నెన్నో అవార్డులు అందుకున్న లతాజీకి వజ్రాలంటే మక్కువ. అందుకేనేమో ఈ గానరత్న సిగలో భారతరత్న ఒద్దికగా ఒదిగింది. లత తమ్ముళ్లు, చెల్లెళ్ళు అందరినీ చక్కటిస్థాయికి తీసుకువచ్చారు. గత కొన్నేళ్లుగా విశ్రాంతి జీవితం గడుపుతూ ప్రశాంతంగా జీవించారు. ఆమె లేని లోటు తీరనిదే అయినా గానకోకిల పాటలు మనతోనే ఉన్నాయి … ఉంటాయి.